మహిళాశిశు సంక్షేమం.. ఫండ్స్ అదనం

మహిళాశిశు సంక్షేమం.. ఫండ్స్ అదనం
  • బడ్జెట్​ లో రూ.3,081 కోట్లు ప్రతిపాదన
  • నిరుటి కన్నా రూ. 219 కోట్లు ఎక్కువ
  • సఖి నివాసాలకు రూ.32.9 కోట్లు
  • దివ్యాంగుల పెండ్లి కానుకకు రూ.15 కోట్లు
  • ప్రగతి పద్దు రూ.1833.48 కోట్లు
  • నిర్వహణ పద్దు రూ.1247.57 కోట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్‌ లో భారీగా నిధులు కేటాయించింది. 2026 – -27 ఆర్థిక సంవత్సరానికి స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రభుత్వం మొత్తం రూ. 3,081 కోట్లను కేటాయించింది. గతేడాది రూ.2,862 కోట్లు కేటాయించగా.. ఈసారి సుమారు రూ.219 కోట్లు  అదనంగా పెంచింది. మహిళలు, చిన్నారులకు భరోసా కల్పించేలా పథకాల అమలుకు ప్రగతి పద్దు రూ.1,833.48 కోట్లు, శాఖాపరమైన నిర్వహణకు రూ. 1,247.57 కోట్లు ప్రతిపాదించింది.

నిరుడి మాదిరిగానే ఈసారి కూడా సఖి నివాసాల నిర్వహణకు రూ. 32.90 కోట్లు కేటాయించింది. దీనికి అదనంగా భరోసా కేంద్రాలు, మహిళా రక్షణ పథకాలకు మరిన్ని నిధులు దక్కాయి. దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాల పంపిణీ కోసం గతేడాది కేటాయించిన రూ. 50 కోట్లను ఈసారి కూడా యథాతథంగా కొనసాగించింది. దివ్యాంగుల వివాహాలను ప్రోత్సహించేందుకు ఇచ్చే పెళ్లి కానుక కోసం రూ.15 కోట్లు కేటాయించింది. వీటికి అదనంగా దివ్యాంగ విద్యార్థుల స్కాలర్‌ షిప్పుల కోసం రూ. 50 కోట్లు వెచ్చించనున్నారు.

ఆరోగ్య లక్ష్మికి రూ. 355 కోట్లు 

చిన్నారులు, గర్భిణుల పోషకాహారమే లక్ష్యంగా పనిచేసే ఐసీడీఎస్ (ఐసీడీఎస్) వ్యవస్థను ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. గతేడాది ఐసీడీఎస్ పథకానికి రూ. 349.55 కోట్లు కేటాయించగా.. ఈసారి ఆరోగ్య లక్ష్మి పథకానికే రూ. 355 కోట్లను కేటాయించారు. దీంతో పాటు అంగన్‌ వాడీల ద్వారా పంపిణీ చేసే ఇతర పోషకాహార కార్యక్రమాలకు కలిపి రూ. 556 కోట్లకు పైగా నిధులు దక్కాయి. అంగన్ వాడీ సెంటర్ల అప్ గ్రడేషన్ కు రూ.37 కోట్లు, సీసీఐ, జేజేబీ, సీడబ్ల్యూసీల నిర్మాణం కోసం రూ. 35 కోట్లు, న్యూట్రీషన్  ప్రోగ్రాంకు రూ. 41 కోట్లు, కీశోర బాలికల సాధికారత కోసం రూ.కోటి కేటాయించారు. శిశువిహార్ అప్ గ్రడేషన్ కు రూ. 5 కోట్లు కేటాయించారు.