ఇందిరమ్మ ఇండ్లకు రూ.7,430 కోట్లు 

ఇందిరమ్మ ఇండ్లకు రూ.7,430 కోట్లు 

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు బడ్జెట్ లో ప్రభుత్వం రూ.7,430 కోట్లు కేటాయించింది. వీటిలో హడ్కో లోన్, వడ్డీలు, ఉద్యోగుల జీతాలు పోగా ఇండ్ల నిర్మాణానికి రూ.5500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పాటు డబుల్ బెడ్రూం ఇండ్లలో మౌలిక వసతుల కల్పన, చివరి దశలో ఉన్న డబుల్ ఇండ్లను పూర్తిచేయనున్నారు.

అయితే గతేడాది హౌసింగ్ శాఖకు రూ.12 వేల కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేటాయింపులు భారీగా తగ్గాయి. హడ్కో నుంచి వీకర్ సెక్షన్ హౌజింగ్ స్కీమ్ కింద ఇండ్ల నిర్మాణానికి రూ.5 వేల కోట్ల లోన్ మంజూరైంది. ఈ నిధులు అందుబాటులో ఉన్నందువల్లే హౌజింగ్ కు బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించినట్లు తెలుస్తోంది. గతేడాది బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకు రూ.వేయి కోట్లు మాత్రమే ప్రభుత్వం రిలీజ్ చేసిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 

మంజూరయ్యాయి. ఇందుకు రూ. 22,500 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుతం సుమారు 2.60 లక్షల ఇండ్లు నిర్మాణం కొనసాగుతుండగా.. వివిధ దశల కింద లబ్ధిదారులకు రూ.5,073.84 కోట్లు చెల్లించినట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల నుంచి నుంచి మరో రూ.200 కోట్లు హౌసింగ్ శాఖకు వస్తాయని అధికారులు చెబుతున్నారు.

వీటితో పాటు పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద రూరల్, అర్బన్ ఏరియాల్లో ఇండ్ల నిర్మాణానికి సెంట్రల్​ఫండ్స్ రానున్నాయి. ఇప్పటివరకు రూరల్ ఏరియాల్లోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకాగా.. ఇక అర్బన్ ఏరియాల్లో టవర్ల రూపంలో ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీహెచ్ ఎంసీలో సుమారు 19 చోట్ల స్థలాలను గుర్తించారు.