ఇందిరమ్మ ఇండ్లకు ‘ఉపాధి’..ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించిన ప్రభుత్వం

ఇందిరమ్మ ఇండ్లకు ‘ఉపాధి’..ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించిన ప్రభుత్వం
  • ప్రతి ఇంటి నిర్మాణంలో ఈజీఎస్​ కింద 90 రోజులపాటు పనులు

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ ను ప్రభుత్వం అనుసంధానం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు గృహ నిర్మాణానికి తోడుగా నిలవడంతోపాటు గ్రామీణ నిరుద్యోగులకు కనీసం 90  రోజుల పనిదినాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా.. ఇందులో 2.50 లక్షల మందికి ఉపాధి హామీ జాబ్  కార్డులు ఉన్నాయి. 

మిగిలిన  50 వేల మంది జాబ్‌ కార్డు లేనివారు దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆమోదించేలా చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా పెళ్లయిన మహిళకు ఇల్లు మంజూరైతే.. అప్పటికప్పుడు ఎంపీడీవో ద్వారా జాబ్‌ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి ఉపాధి హామీ స్కీమ్  కింద రూ. 27 వేలు, స్వచ్ఛ భారత్  మిషన్​ (ఎస్‌‌బీఎం)  కింద రూ.12 వేలు అందనున్నాయి. అయితే,  ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ఉపాధి హామీ కింద పని దినాలను కేటాయించనున్నారు. 

ప్రస్తుతం ఉపాధి కూలీకి రోజుకు రూ.307 వేతనం లభిస్తోంది. ఈ లెక్కన 90 రోజుల పాటు పని చేయడం ద్వారా ఒక్కో కూలీకి రూ.27,630 వరకు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనం చేకూరనున్నది. వీటితో పాటు ఎస్‌‌బీఎంలో టాయిలెట్స్ నిర్మాణంతోపాటు ఇతర పారిశుధ్య పనులకు రూ.12 వేలు ఇవ్వనుంది.  అంతేకాకుండా, ఒక్కో ఇంటికి పీఎం ఆవాస్ యోజన కింద రూ. 72 వేలు ఇస్తుండగా.. ఇప్పుడు ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ నిధులు అందించనుండటంతో  లబ్ధిదారులకు అదనపు ప్రయోజనం చేకూరనున్నది.