నిమ్స్​ నర్సులు వెంటనే విధుల్లో చేరాలి

నిమ్స్​ నర్సులు వెంటనే విధుల్లో చేరాలి

హైదరాబాద్, వెలుగు: నిమ్స్​లో నర్సులు ఆందోళన విరమించి, వెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. హెల్త్ సెక్రటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, కార్మిక శాఖ కమిషనర్​తో మంత్రి హరీశ్ రావు మంగళవారం మీటింగ్ నిర్వహించారు. నర్సుల ఆందోళనలపై చర్చించారు. ఆపై ఒక ప్రకటన రిలీజ్​ చేశారు. గత నెల 28న నర్సుల సమస్యలపై హెల్త్ సెక్రటరీ, నిమ్స్ యాజమాన్యంతో కలిసి నర్సులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఇందులో ఎన్​హెచ్​ఎం కాంట్రాక్టు నర్సులతో సమానంగా 30 శాతం వేతనం పెంపు, పే స్లిప్స్, వెయిటేజీ, ఎరియర్స్, రెగ్యులర్  రిక్రూట్మెంట్ లో కూడా అవకాశం కల్పించడం వంటి 24 డిమాండ్లపై ప్రభుత్వం అప్పటికప్పుడే ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు. నర్సుల డిమాండ్లకు సర్కారు సానుకూలంగా స్పందించినా.. ఇంకా ఆందోళనలు చేస్తూ పేషెంట్లకు ఇబ్బందులు కలిగించడం మంచిది కాదని పేర్కొన్నారు. ఎలాంటి పరీక్ష లేకుండా.. రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా.. 6 నెలల కాలానికి విధుల్లో చేరిన నర్సులు రెగ్యులరైజ్ చేయాలని కోరడం నిబంధనలకు లోబడి లేదని ప్రకటనలో స్పష్టం చేశారు.