మున్సిపల్ ఎన్నికల తర్వాతనే కరోనాపై ఆంక్షలంటున్న ప్రభుత్వం

మున్సిపల్ ఎన్నికల తర్వాతనే కరోనాపై ఆంక్షలంటున్న ప్రభుత్వం
  •        ఈ నెల 30 తరువాతే పెట్టాలని సర్కారు యోచన
  •        కరోనా పెరుగుతుండడంతోనైట్ కర్ఫ్యూ, రిస్ట్రిక్షన్లు పెట్టాలంటున్న అధికారులు
  •       వద్దంటోన్న సీఎం కేసీఆర్

 వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, ఐదు మున్సిపాల్టీల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈనెల 30 వరకు రాష్ట్రంలో ఎలాంటి కరోనా ఆంక్షలు పెట్టొద్దని ప్రభుత్వం భావిస్తోంది. ఏ చిన్నపాటి ఆంక్షలు విధించినా మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం పడే చాన్స్ ఉందని అంచనా వేస్తోంది. అందుకని ఎన్నికలు పూర్తయ్యే వరకు మౌనంగా ఉండాలని అనుకుంటోంది. రాష్ట్రంలో 15 రోజుల నుంచి వైరస్ బాగా పెరిగిపోతోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడి కోసం పబ్లిక్ గ్యాదరింగ్స్, బార్లు, వైన్స్, సినిమా థియేటర్లపై కొన్ని ఆంక్షలు విధించాలని అదే టైమ్​లో కొన్ని రోజుల పాటు నైట్ కర్ఫ్యూ విధించాలని ఆఫీసర్లు సూచించినట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆంక్షలు విధించేందుకు సీఎం కేసీఆర్ నిరాకరించినట్టు అధికారులు చెప్తున్నారు.

ఎన్నికలపై ఎఫెక్ట్ పడ్తదని..

ఈనెల 30న రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 3న ఓట్ల లెక్కింపు ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. నామినేషన్ల విత్ డ్రా తర్వాత వరంగల్, ఖమ్మం సిటీల్లో మంత్రి కేటీఆర్ రోడ్డు షోలకు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఆంక్షలు విధిస్తే ఎన్నికల జరిగే ప్రాంతాలపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందని సీఎం కేసీఆర్ భావిస్తునట్టు ఆఫీసర్లు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ప్రతి రోజు ప్రభుత్వం విడుదల చేసే కరోనా బులెటిన్ పై అనుమానాలు ఉన్నాయి. బులెటిన్ లో పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య తక్కువగా చూపిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆంక్షలు విధిస్తే వైరస్ ఉధృతి ఉందని ఒప్పుకున్నట్టు అవుతోందని, అలాగే ఎన్నికలు వాయిదా వేయాలని విపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. ‘‘ఇప్పుడు ఆంక్షలు పెడితే, ఎన్నికలు ఎట్ల నిర్వహిస్తారని విమర్శలు వస్తాయి. అందుకే సీఎం ఆంక్షలు వద్దని అంటున్నారు.’’అని ఓ సీనియర్ లీడర్ అభిప్రాయపడ్డారు.

పోలింగ్ తర్వాత చూద్దాం

రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రత్యేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సీఎం కేసీఆర్ ఆఫీసర్లను ఆదేశించినట్టు తెలిసింది. ఈ విషయంలో కేంద్ర నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని చెప్పినట్టు సమాచారం. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి కొత్త నిర్ణయాలు వద్దని, ఆప్పటి వరకు మౌనంగా ఉండాలని సూచించినట్టు సమాచారం. ఒకవేళ పరిస్థితి చెయి దాటిపోతే ఈ నెల 30 తర్వాత నైట్ కర్ఫ్యూ తో పాటు కొన్ని ఆంక్షల విధింపుపై ఆలోచన చేద్దామని సీఎం కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్టు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వివరించారు.