సర్కార్ కాలేజీలకు డిజిటల్ స్క్రీన్లు.. ప్రతీ కాలేజీకి ఫ్రీగా ఇంటర్నెట్, జూమ్ కనెక్షన్

సర్కార్ కాలేజీలకు డిజిటల్ స్క్రీన్లు.. ప్రతీ కాలేజీకి ఫ్రీగా ఇంటర్నెట్, జూమ్ కనెక్షన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో డిజిటల్ బోధనను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి కాలేజీకి డిజిటల్ స్క్రీన్లు అందించాలని డిసైడ్ అయింది. వచ్చేనెలలో వీటిని కాలేజీలకు అందించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

స్టేట్​లో 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, వాటిలో 1.61 లక్షల మంది చదువుతున్నారు. ప్రస్తుతం ఈ విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎప్ సెట్ తదితర ప్రవేశపరీక్షలతో పాటు కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకున్నది. ప్రస్తుతం కొన్ని కాలేజీల్లో ప్రొజెక్టర్లు, కంప్యూటర్ స్ర్కీన్లపై పాఠాలు వినిపిస్తున్నారు.

ప్రొజెక్టర్ ఒక్కటే ఉండటం, కంప్యూటర్ స్క్రీన్లు చిన్నగా ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి సర్కారు కాలేజీకి 75 ఇంచుల 4 డిజిటల్ స్క్రీన్లులు లేదా మూడు పెద్ద కలర్ టీవీలు, ఒక ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్​టీ) అందించాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వీటి ద్వారానే ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ ఆన్‌‌‌‌లైన్ క్లాసులను పిల్లలకు అందించనున్నారు. అక్టోబర్ వరకు వీటిని కాలేజీలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీటి నిర్వహణ కోసం ఇప్పటికే కాలేజీల్లో ఎంపిక చేసిన ఏఐ ఛాంప్స్ (టీచింగ్/నాన్ టీచింగ్)కి రెండు రోజుల ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు.

ఫ్రీ ఇంటర్నెట్ కనెక్షన్లు
డిజిటల్ విద్యా విధానాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి కాలేజీకి ఉచితంగా ఇంటర్నెట్, జూమ్ కనెక్షన్ కూడా కల్పించాలని ఇంటర్ అధికారులు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే చాలా కాలేజీల్లో ప్రిన్సిపాల్స్ ఇంటర్నెట్ కనెక్షన్లు తీసుకున్నారు. కొన్ని చోట్ల లెక్చరర్ల ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ తీసుకుంటున్నారు. దీనిద్వారా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఇంటర్నెట్ కనెక్షన్లనూ అందించాలని నిర్ణయించారు.