సర్కార్ ఇంటర్ స్టూడెంట్లకు ఇంకా అందని బుక్స్

సర్కార్ ఇంటర్ స్టూడెంట్లకు ఇంకా అందని బుక్స్
  • సర్కార్ ఇంటర్ స్టూడెంట్లకు ఇంకా అందని బుక్స్
  • సెకండియర్ విద్యార్థులకు పూర్తిస్థాయిలో రాలె 
  • ఫస్టియర్ పుస్తకాలు ఈ మధ్యే ప్రింటింగ్ పూర్తి 
  • తెలుగు అకాడమీ నిర్లక్ష్యమే అంటున్న అధికారులు
  • పుస్తకాల్లేక అవస్థలు పడుతున్న పేద విద్యార్థులు 

హైదరాబాద్, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్​ మండలంలో గవర్నమెంట్ జూనియర్​ కాలేజీతో పాటు మోడల్ స్కూల్ కూడా ఉంది. సర్కారు కాలేజీలో 240 మంది, మోడల్ స్కూల్​లో 220 మంది చదువుతున్నారు. వాటిలో చదివే ఫస్టియర్, సెకండియర్ స్టూడెంట్లకు ఇప్పటి వరకూ పాఠ్య పుస్తకాలు రాలేదు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలో 1,400 మంది స్టూడెంట్లు ఉన్నారు. వారి కోసం 7 వేల పుస్తకాలు అవసరమని ఉన్నతాధికారులకు ఇండెంట్ పెట్టారు. కానీ గురువారం సెకండియర్, ఫస్టియర్ అన్నీ కలిపి కేవలం 800 వరకూ పుస్తకాలు అందాయి. ఈ పరిస్థితి రెండు, మూడు కాలేజీల్లోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్కారు కాలేజీల్లో ఉన్న దుస్థితి. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు దాటినా, ఇప్పటికీ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు పుస్తకాలు అందలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పుస్తకాలు లేకుండా చదువులెట్లా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

పాత పుస్తకాలతోనే పాఠాలు

రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో చదివే స్టూడెంట్లకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తోంది. 2022–23 అకాడమిక్ ఇయర్​కు సంబంధించి పుస్తకాల ప్రింటింగ్ బాధ్యతలను తెలుగు అకాడమీకి  అప్పగించారు. దాదాపు మూడు లక్షల మందికి పుస్తకాలు అందించాల్సి ఉంది. జూన్ 15 నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు, జులై 1 నుంచి ఫస్టియర్ స్టూడెంట్లకు క్లాసులు మొదలయ్యాయి. అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో బుక్స్ అందలేదు. సెకండియర్ స్టూడెంట్లకు సంబంధించి ముందుగానే ప్రింటింగ్ పూర్తయినా, జిల్లాలకు ఇంకా చేరలేదని లెక్చరర్లు చెబుతున్నారు. వంద మందికి బుక్స్ అవసరముంటే, కేవలం పదికి మందికి సరిపడ పుస్తకాలు పంపించారని వరంగల్ జిల్లాకు చెందని ఓ ప్రిన్సిపల్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాత పుస్తకాలుంటే, వాటితోనే అడ్జెస్టు చేసి పాఠాలు చెప్తున్నారు. మరోపక్క ఫస్టియర్ స్టూడెంట్లకు సంబంధించిన పుస్తకాల ప్రింటింగ్ కూడా పూర్తయిందని చెప్తున్నా, జిల్లాలకు మాత్రం చేరలేదు. పేపర్ కొరతతోనే ప్రింటింగ్ ఆలస్యమైందని తెలుగు అకాడమీ అధికారులు చెప్తున్నారు. 

వచ్చే నెలలో హాఫ్​ ఇయర్లీ

వచ్చేనెల రెండో వారంలో ఇంటర్ స్టూడెంట్లకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పుస్తకాలు ఇప్పటికీ ఇవ్వని అధికారులు.. పరీక్షలు ఎలా నిర్వహిస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మ్యాథ్స్, కామర్స్, ఫిజికల్స్ సైన్స్ పుస్తకాలు లేకుంటే చదువులు కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీట్, జేఈఈ, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షలకు ఎట్లా ప్రిపేర్ కావాలని అడుగుతున్నారు. మరోపక్క కొంతమంది విద్యార్థులు మార్కెట్​లో పుస్తకాలు కొనుక్కున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, విద్యార్థులకు సరిపడా పుస్తకాలను వెంటనే కాలేజీలకు పంపించాలని విద్యార్థులు కోరుతున్నారు.