పవర్​పాయింట్ ​ప్రజెంటేషన్​లో సర్కారువన్నీ అబద్ధాలే : హరీశ్​రావు

పవర్​పాయింట్ ​ప్రజెంటేషన్​లో సర్కారువన్నీ అబద్ధాలే : హరీశ్​రావు

 

  • ఆరు నెలల్లోనే ట్రిబ్యునల్​ వాటాలు తేల్చాలని కోరుదాం
  •     కేసీఆర్ ఒత్తిడితోనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు
  •     అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు 

హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కి ప్రాజెక్టుల అప్పగింతపై పవర్​పాయింట్ ​ప్రజెంటేషన్​లో ప్రభుత్వం అన్నీ అబద్ధాలే చెప్పిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. తమ పార్టీ చలో నల్గొండకు పిలుపునిచ్చిన తర్వాతే ప్రభుత్వం దిగివచ్చి అసెంబ్లీలో దీనిపై తీర్మానం ప్రవేశపెట్టిందన్నారు. కేఆర్ఎంబీకి శ్రీశైలం, నాగార్జున సాగర్​ ప్రాజెక్టుల అప్పగింత.. ఈ అంశంపై గత, ప్రస్తుత ప్రభుత్వాల నిర్ణయాలపై ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్ ​కుమార్​రెడ్డి సోమవారం అసెంబ్లీలో ఇచ్చిన పవర్​పాయింట్ ప్రజెంటేషన్​పై హరీశ్ రావు మాట్లాడారు. తాము కూడా ప్రజెంటేషన్​ ఇస్తామంటే చాన్స్ ఇవ్వలేదన్నారు. 

సభ ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నదే తమ ఉద్దేశమన్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే చేసిన తప్పులను సరి చేసుకునేందుకు తాము పిలుపునిచ్చిన నల్గొండ సభకు ఒక రోజు ముందు ఈ తీర్మానం ప్రవేశపెట్టిందని.. ఇది ప్రజల విజయమన్నారు.‘‘కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత– వాస్తవాలు” పేరుతో ప్రభుత్వం బుక్​లెట్​రిలీజ్​చేసిందని, దీనికి అవాస్తవాలు అని పేరు పెట్టాల్సిందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అపెక్స్​కౌన్సిల్​మీటింగ్​లోనే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించినట్టు రాశారని, కానీ అది నిజం కాదన్నారు. కేంద్రం కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలపై గెజిట్​నోటిఫికేషన్​ఇస్తే తాము దాన్ని సవాల్​చేయలేదనేది నిజం కాదని చెప్పారు. ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్​బొజ్జా కేంద్ర ప్రభుత్వానికి జనవరి 27న రాసిన లేఖలోనే ఈ విషయం ఉందన్నారు. రెండో అపెక్స్​కౌన్సిల్​మీటింగ్​లో కృష్ణా నీళ్లను ప్రాజెక్టుల వారీగా కేటాయించేందుకు ట్రిబ్యునల్​కు రెఫర్​చేయాలని కేసీఆర్ పట్టుబట్టారని, కేంద్ర మంత్రి సూచనతో సుప్రీంకోర్టులో పిటిషన్​ను విత్​డ్రా చేసుకున్నామని తెలిపారు. కేసీఆర్​ఒత్తిడితోనే కేంద్రం ట్రిబ్యునల్​ ఏర్పాటు చేసిందన్నారు. 

జగన్ మాట్లాడింది గోదావరి నీళ్లపైనే.. 

ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేసేలా తామే ఒప్పుకున్నామని చెప్తున్నారని, అది అడ్​హక్​బేసిస్​మీద చేసుకున్న ఒప్పందమేనని హరీశ్ రావు అన్నారు. ఈ ఒప్పందాన్ని సరి చేయాలని, కృష్ణాలో ట్రిబ్యునల్​వాటాలు తేల్చేవరకు 50 శాతం వాటా ఇవ్వాలని 2018 నుంచే కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. తమ ప్రభుత్వంలో ఇరిగేషన్​సెక్రటరీగా పని చేసిన స్మితా సబర్వాల్​కూడా ప్రాజెక్టులు హ్యాండోవర్​ చేస్తామని ఎక్కడా ఒప్పుకోలేదన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదని, రేవంత్​రెడ్డికి సీఎం సీటు కూడా లేదన్నారు. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను మాత్రమే వాడుకోవాలని ఏపీకి చెప్పాం తప్ప కృష్ణా నీళ్లను తీసుకోవాలని చెప్పలేదన్నారు. ఏపీ అసెంబ్లీలో జగన్​మాట్లాడింది కూడా గోదావరి జలాల గురించేనని అన్నారు.  

రాయలసీమ లిఫ్ట్ పై స్టే తెచ్చాం.. 

కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై సభలో రెండు రోజులైనా చర్చ పెడుతామని, ఎంతసేపైనా మాట్లాడొచ్చని సీఎం బయట చెప్తున్నారని, కానీ సభలో తాము మాట్లాడుతుంటే మైక్​కట్​చేస్తున్నారన్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు తాము సహకరించామనేది తప్పుడు ఆరోపణ అని చెప్పారు. వైఎస్ఆర్​అధికారంలో ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు విస్తరణపై పేగులు తెగేదాకా కొట్లాడిందే తామన్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన ఏడో రోజే కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు. రెండో అపెక్స్​కౌన్సిల్​లో సుప్రీంకోర్టులో కేసు వాపస్​తీసుకుంటే సెక్షన్–3 కింద ట్రిబ్యునల్​కు రెఫర్​చేస్తామని కేంద్ర మంత్రి మాట ఇచ్చారన్నారు. కొత్త ట్రిబ్యునల్​ఆరు నెలల్లోనే నీటి వాటాలు తేల్చాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. దీనిపై ప్రభుత్వం చేసే పోరాటంలో తాము కలిసి వస్తామన్నారు. 

నెల రోజుల్లో అప్పగిస్తామన్నరు.. 

కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి 17న కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీటింగ్​లోనే శ్రీశైలం, నాగార్జున సాగర్​లను నెల రోజుల్లోగా అప్పగిస్తామని, ఏడు రోజుల్లో కేఆర్ఎంబీ రెండు రాష్ట్రాల ఈఎన్సీలతో సమావేశం నిర్వహించి దీనిపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయిస్తుందని ప్రతిపాదిస్తే అందుకు అంగీకారం తెలిపారని హరీశ్ రావు అన్నారు. ఆ సమావేశం మినిట్స్​లోనే ఇది స్పష్టంగా ఉందన్నారు. సాగర్​పై సీఆర్పీఎఫ్​బలగాల రక్షణ ఉంటుందని, కేఆర్ఎంబీ అనుమతితోనే తెలంగాణ ఇంజనీర్లు ప్రాజెక్టుపైకి వెళ్లాలని కూడా అందులో పేర్కొన్నారని తెలిపారు. బోర్డులకు రెండు రాష్ట్రాలు డబ్బులు వెంటనే విడుదల చేయాలంటే ఒప్పుకున్నారని తెలిపారు. తెల్లారి అన్ని పేపర్లలో దీనిపై వార్తలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేదని, తాను ప్రెస్​మీట్​పెట్టిన తర్వాతే స్పందించారన్నారు. ఫిబ్రవరి 1న కేఆర్ఎంబీ సమావేశం తర్వాత ఇరిగేషన్​ఈఎన్సీ మీడియాతో మాట్లాడిన వీడియోను హరీశ్​ సభలో ప్లే చేయగా భట్టి విక్రమార్క జోక్యం చేసుకున్నారు. ఈఎన్సీ మురళీధర్​తో బీఆర్ఎస్ ​అలా మాట్లాడించిందని, పదేండ్లు బీఆర్ఎస్​ వాళ్లు ఏం చెప్తే ఆయన ఆ పని చేశారన్నారు. హరీశ్ ​స్పందిస్తూ.. ప్రభుత్వ తప్పిదాన్ని అధికారిపై వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.