లష్కర్ బోనాలకు ఇబ్బందులు రావొద్దు: మంత్రి తలసాని

లష్కర్ బోనాలకు ఇబ్బందులు రావొద్దు:   మంత్రి తలసాని

సికింద్రాబాద్, వెలుగు :  లష్కర్ బోనాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్​లోని ఉజ్జయిని మహంకాళి ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి తొలిబోనం సమర్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

 లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అమ్మవారి దర్శనానికి భక్తులను క్యూలో పంపించేందుకు బారికేడ్లను ఏర్పాటు  చేసినట్లు చెప్పారు. పోలీసులతో పటిష్టమైన బందోబస్తు కొనసాగించాలని తెలిపారు. మంత్రి వెంట జీహెచ్ఎంసీ  కమిషనర్ రొనాల్డ్ రోస్, నార్త్ జోన్ డీసీపీ  చందన దీప్తి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఆర్డీవో  వసంతకుమారి, ట్రాఫిక్ డీసీపీ  రాహుల్ హెగ్డే, ఏసీపీ  రమేష్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ తదితరులు ఉన్నారు. 

ఇయ్యాల అర్ధరాత్రి నుంచి  ట్రాఫిక్ ఆంక్షలు

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఇయ్యాల అర్ధరాత్రి నుంచి ఈ నెల 10న జాతర ముగిసే వరకు సికింద్రాబాద్​లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందుకు సంబంధించి సిటీ సీపీ ఆనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్బాలా మైదాన్, రాణిగంజ్, ఓల్డ్ రాంగోపాల్ పేట, ప్యారడైస్, సీటీవో, ఎస్బీఐ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ క్రాస్ రోడ్స్, సెయింట్ జాన్ రోటరీ, సంగీత్ క్రాస్ రోడ్, ప్యాట్నీ సెంటర్​,  బాటా,  ఘాస్​మండి క్రాస్ రోడ్, బైబిల్​హౌస్,  మినిస్టర్స్ రోడ్, రసూల్​పురా రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. వాహనదారులు ఇతర రూట్లలో వెళ్లాలన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందుభాగం రెజిమెంట్ బజార్ వైపు బోనాల సందర్భంగా ట్రాఫిక్ రద్దీ ఉంటుందని.. ప్యాసింజర్లు స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్ ఫాం వైపు కాకుండా చిలకలగూడ గేట్ వైపు నుంచి పదో నంబర్ ప్లాట్​ఫాం నుంచి లోపలికి రావాలన్నారు.  

పలు రోడ్ల మూసివేత...

లష్కర్ బోనాల సందర్భంగా ఆలయం చుట్టూ సుమారు 2 కి.మీ పరిధిలో ట్రాఫిక్ జామ్ ఉంటుందని..  సమీపంలోని పలు రోడ్లను  మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టొబాకో బజార్, హిల్ స్ట్రీట్ రోడ్,  సుభాష్​రోడ్​లో బాటా క్రాస్ రోడ్ నుంచి ఓల్డ్ రాంగోపాల్ పేట పీఎస్ వరకు, సికింద్రాబాద్ లోని ఆదయ్యనగర్ రోడ్, జనరల్ బజార్ రోడ్లను జాతర పూర్తయ్యే వరకు మూసివేస్తామన్నారు. ఈ రూట్లలో వెహికల్స్​కు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.