ఫిబ్రవరిలో మరో డీఎస్సీ!

ఫిబ్రవరిలో మరో డీఎస్సీ!
  • జాబ్ కాలెండర్ ప్రకారమే ముందుకు..
  • ప్రీ ప్రైమరీ సెక్షన్లకూ టీచర్ పోస్టులు 
  • నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ 

హైదరాబాద్, వెలుగు: మరో డీఎస్సీ వేసేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు వెళ్లాలని భావిస్తున్నది. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీ 2023 ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే ఆన్​లైన్​లో పరీక్షలు పూర్తికాగా, ప్రిలిమినరీ కీని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేశారు. త్వరలోనే ఫైనల్ కీతోపాటు జీఆర్ఎల్ కూడా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విద్యాహక్కు చట్టం ప్రకారం 1: 30 టీచర్ స్టూడెంట్ రేషియో ఉండాల్సి ఉండగా, రాష్ట్రంలో మాత్రం 1: 16 రేషియో ఉంది. రేషనలైజేషన్ చేస్తే చాలా పోస్టులు మిగిలిపోతాయని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. దీన్ని అమలు చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. దీనికి అనుగుణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోంది.

ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే, ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు ఐదు వేల పోస్టులతో డీఎస్సీ వేస్తామంటూ ప్రకటనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని  ప్రైమరీ స్కూళ్లలో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకూ సర్కారు కసరత్తు చేస్తున్నది. ఈ బడుల్లో పాఠాలు చెప్పేందుకు డీఎస్సీ–2025 ద్వారా టీచర్లను తీసుకోవాలని భావిస్తున్నది. 

నవంబర్​లో టెట్..

 టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)కు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు ప్లాన్​ చేస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియతో పాటు ప్రిపరేషన్​కు మూడు నెలలు ఇవ్వనున్నారు. అనంతరం వచ్చేఏడాది జనవరిలో ఆన్​లైన్​ పరీక్షలు నిర్వహించనున్నారు.