- క్యాంపస్‌ల ఏర్పాటుపై బ్రిటన్ ప్రతినిధులతో అధికారుల భేటీ
- ఒకే పోర్టల్ ద్వారా అనుమతులిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బ్రిటన్‌కు చెందిన ప్రముఖ విద్యాసంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించింది. యూకే హైకమిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం తాజ్ డెక్కన్ హోటల్‌లో యూకే స్కూల్ గ్రూపుల ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారులు సమావేశమయ్యారు.
ఈ భేటీలో రాష్ట్రంలో యూకే స్కూళ్ల స్థాపన, అనుమతుల ప్రక్రియ, భవిష్యత్ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త స్కూళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాటు గురించి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ వివరించారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ, కేంబ్రిడ్జ్ వంటి అంతర్జాతీయ సిలబస్‌లకు ఎన్ వోసీ పొందే విధానాన్ని వెల్లడించారు. స్కూళ్ల అనుమతుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ పోర్టల్‌ను స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ కె.లింగయ్య డెమో ద్వారా చూపించారు. పారదర్శకంగా డిజిటల్ పద్ధతిలో క్లియరెన్స్ ఇచ్చే విధానంపై యూకే ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో విద్యా హబ్..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ విజన్‌ను ఎఫ్‌సీడీఏ కమిషనర్ కె.శశాంక వివరించారు. ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ తమ క్యాంపస్‌లను ప్రారంభించాలని యూకే విద్యాసంస్థలను కోరారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు గురించి కూడా ప్రస్తావించారు.
2047 నాటికి తెలంగాణను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. స్కూల్ బిల్డింగ్ భద్రత, ఫైర్ ఎన్ వోసీ, నిర్మాణ పటిష్టతకు సంబంధించిన నియమ నిబంధనలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ సృజన వివరించారు. సమావేశంలో ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ జి.రమేశ్, సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ బి.వెంకటనర్సమ్మతోపాటు యూకే స్కూల్ గ్రూపుల సీఈవోలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
