వరదల చుట్టే .. వరంగల్‌‌‌‌‌‌‌‌ పాలిటిక్స్

వరదల చుట్టే ..  వరంగల్‌‌‌‌‌‌‌‌ పాలిటిక్స్
  • మొదట రూ. 3,800 ఇస్తామన్న మంత్రి ఎర్రబెల్లి
  • వరద నివారణ, ఆర్థికసాయంపై స్పందించని ప్రభుత్వం
  •  ఆందోళనకు దిగుతున్న ప్రతిపక్షాలు

వరంగల్‍, వెలుగు : భారీ వర్షాల కారణంగా గ్రేటర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన వరదలు ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారాయి. నష్టపోయిన వారిని ఆదుకుంటామని మంత్రులు, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చి మూడు వారాలు గడిచినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీన్నే ఆయుధంగా వాడుకుంటూ ప్రతిపక్షాలు రోడ్డెక్కుతున్నాయి. నష్టపోయిన ఒక్కో ఫ్యామిలీకి రూ. 25 వేలు ఇవ్వాలని ఓ పార్టీ, రూ. 40 వేలు ఇవ్వాలంటూ మరో పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలకు దిగుతున్నారు. 

నగరంలో రూ.800 కోట్ల నష్టంగత నెల 25 నుంచి 28 వరకు భారీ వర్షాలు పడడంతో వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని 154 కాలనీలు నీట మునిగాయి. దీంతో ప్రజలు ఇండ్లకు తాళాలుపెట్టి పునరావాసకేంద్రాలు, బంధువుల ఇండ్లకు వెళ్లారు. వానలు, వరదలు తగ్గాక తిరిగి వచ్చి చూసే సరికి ఇండ్లలోని బియ్యం బస్తాలు, నిత్యావసరాలు, దుస్తులు, టీవీలు, కూలర్లు, ఫ్రిజ్‍లు, కంప్యూటర్లు, ఇండ్ల ముందు పార్క్‌‌‌‌‌‌‌‌ చేసిన బైక్‌‌‌‌‌‌‌‌లు, కార్లు పనికిరాకుండా మారాయి. ఒక్కో కుటుంబానికి రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షలకుపైగా ఆస్తి నష్టం జరిగింది. నగరంలో రోడ్లు, కల్వర్టులు, పైప్‌‌‌‌‌‌‌‌లైన్లు దెబ్బతినడంతో రూ.400 కోట్లు, ప్రజల ఆస్తి నష్టం మరో రూ. 400 కోట్లు కలిపి మొత్తంగా రూ. 800 కోట్ల నష్టం జరిగినట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. 

కేటీఆర్‌‌‌‌‌‌‌‌ చెప్పిన పనులు కాలే...పరామర్శకు రాలే..

2020 ఆగస్టు 15న వరంగల్‌‌‌‌‌‌‌‌లోని పలు కాలనీలు నీట మునగడంతో 18న మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ పర్యటించి ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. తర్వాత ఎన్‌‌‌‌‌‌‌‌ఐటీలో రెండు గంటల పాటు ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. వరంగల్‌‌‌‌‌‌‌‌లో వరదల నివారణకు రూ.250 కోట్లతో శాశ్వత చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. మూడేళ్లు గడిచినా ఒక్క పని కూడా ముందుకు పడలేదు. ఇప్పుడు మరోసారి వరదలు రావడంతో వందల కోట్ల నష్టం వాటిల్లడమే కాకుండా గ్రేటర్‌‌‌‌‌‌‌‌ పరిధిలో నలుగురు చనిపోయారు. ఇంత జరిగినా సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ గానీ, మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ గానీ వరంగల్‌‌‌‌‌‌‌‌ వైపు కన్నెత్తి చూడలేదు. నగరానికి వస్తే ఆర్థికసాయం ప్రకటించాల్సి వస్తుందనే వారు రాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వరదసాయంపైనే ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు

గ్రేటర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌లో వరదలు, నష్టపోయిన వారికి ఆర్థికసాయం అంశం ఇప్పుడు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారాయి. వరద బీభత్సం సృష్టించిన టైంలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ గానీ, మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ గానీ పరామర్శకు రాకపోవడం, కనీసం ఆర్థికసాయం ప్రకటన కూడా చేయకపోవడం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లకు నెగెటివ్‌‌‌‌‌‌‌‌గా మారింది. దీన్నే ప్రధాన అస్త్రంగా మార్చుకొని కాంగ్రెస్‍, బీజేపీ, బీఎస్పీ వంటి పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. గవర్నర్‌‌‌‌‌‌‌‌ తమిళిసై సౌందరాజన్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌కు ముందే కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెస్పీ జాతీయ అధ్యక్షుడు మంద  కృష్ణ మాదిగ జిల్లాలో పర్యటించగా, ఇటీవల బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‍ఎస్‍.ప్రవీణ్‍కుమార్‌‌‌‌‌‌‌‌ వచ్చారు. జిల్లాకు ఏ పార్టీ లీడర్‌‌‌‌‌‌‌‌ వచ్చినా ప్రధానంగా వరద సాయంపైనే అధికార పార్టీ లీడర్లను ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష లీడర్లు కాలనీల్లో తిరుగుతూ ఇదే అంశంపై ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు పరిహారం అందించాలని, వరద నివారణ చర్యలు తీసుకోవాలంటూ ధర్నాలు, రాస్తారోకోలకు పిలుపునిస్తున్నారు. దీంతో సమాధానం చెప్పలేక అధికార పార్టీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు.