రైతును కొన్ని పంటలకే పరిమితం చేస్తున్నది ప్రభుత్వ విధానాలే !

రైతును కొన్ని పంటలకే పరిమితం చేస్తున్నది ప్రభుత్వ విధానాలే !

భారతదేశంలో ఆధునిక వ్యవసాయం ప్రవేశపెట్టి  రైతుల దిశను మళ్లించేందుకు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. హరితవిప్లవం పేరిట ప్రవేశపెట్టిన ఆధునిక విత్తన వంగడాలు, రసాయన ఎరువులు, రసాయన కీటకనాశకాలు,  యాంత్రీకరణ వగైరా వల్ల రైతులు క్రమంగా కొన్ని పంటలకే పరిమితం అయ్యే దుస్థితికి చేరుకున్నారు. 

పేదలకు ఉచిత, ఆ తరువాత తక్కువ ధరలకు ఆహారం అందించే నెపంతో కొన్ని పంటల సేకరణ కూడా మొదలు అయ్యింది. ఈ మొత్తం ప్రక్రియకు అవసరమైన సాంకేతిక, సంస్థాగత వ్యవస్థ మీద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.

ఈ వ్యవస్థ  వేళ్లూనుకోవడానికి ఏండ్ల నుంచి రాయితీలు, సబ్సిడీలు కూడా ప్రకటిస్తూనే ఉన్నారు.  రైతులు ఆ దిశలో పయనించి ఏక పంట పద్ధతికి అలవాటుపడ్డాక ఇప్పుడు ప్రభుత్వాలకు ‘ఈ సబ్సిడీ’ భారంగా అనిపిస్తున్నది.  రైతులను క్రమంగా గాలికి వదిలేస్తున్న పరిస్థితి చూస్తున్నాం.  రైతులకు ల్యాబ్ టు ల్యాండ్ వంటి పథకాలు ఉండేవి. వ్యవసాయ విస్తరణ వ్యవస్థ ద్వారా ల్యాబ్​లో పరిశోధించిన ఫలితాలు రైతులకు చేరవేసే పద్ధతి ఉండేది. ఆర్థిక రంగ సవరణల పేరిట వ్యవసాయ విస్తరణ మీద ప్రభుత్వ పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. 

ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి, ఆయా పరికరాలు, పద్ధతులు, రసాయనాలు గురించి కనీస అవగాహన లేని రైతులు అనేకమంది తమ అసువులు బాసారు.  ఇప్పటికీ ప్రమాదకరమైన కీటకనాశకాలను వాడి చనిపోతున్నారు.  ఒక ఎకరం వ్యవసాయం చేయాలంటే లక్షల పెట్టుబడి పెట్టాల్సి వస్తున్నది. మార్కెట్లో దానికి తగ్గ గిట్టుబాటు ధర మాత్రం రాదు.  ఏండ్ల నుంచి రెండు పంటలు మాత్రమే సేకరిస్తున్నారు.   గోధుమలు, వరి. ఇతర పంటలు అప్పడప్పుడు సేకరిస్తున్నా ఈ రెండు పంటలు సేకరించినంతగా స్థిరంగా లేదు. ఈ రెండు పంటల సేకరణ కూడా దేశవ్యాప్తంగా ఒకే విధంగా లేదు.

మొదటి నుంచి కూడా పంజాబ్  రాష్ట్రంలోనే  వరి, గోధుమల సేకరణ ఎక్కువ.  భారత  ప్రభుత్వం ఖరీఫ్ 2025–-26  మార్కెటింగ్  సీజన్ కోసం 46.35 మిలియన్ టన్నుల(ఎంటీ)  బియ్యం సేకరణ లక్ష్యాన్ని నిర్దేశించింది.  ఇది ఖరీఫ్ 2024-–25 సీజన్‌‌‌‌లో సేకరించిన 47.38 ఎంటీ కంటే స్వల్పంగా తక్కువగా ఉంది.  దీనికి అనుగుణంగా వరి ధాన్యం సేకరణ లక్ష్యం సుమారు 68.95 ఎంటీగా ఉంది (67% వరి -నుంచి -బియ్యం మార్పిడి నిష్పత్తి ఆధారంగా). 11.6 మిలియన్ టన్నుల బియ్యం (సుమారు 17.3 మిలియన్ టన్నుల వరి ధాన్యం) లక్ష్యంతో,  కేంద్ర నిధికి అత్యధిక వాటాను అందించే రాష్ట్రంగా పంజాబ్  కొనసాగుతోంది.

లక్ష్యాలు, వాస్తవ సేకరణకు మధ్య వ్యత్యాసాలు 
వరి, గోధుమలు, ఇంకా  ఇతర పంటలు ఎన్ని ఎకరాలలో  వేశారో  వ్యవసాయశాఖ అంచనాలు వేస్తుంది.   ఆమేరకు సేకరణ లక్ష్యాలు ఏర్పరచుకోవచ్చు. ముందుగానే సేకరణకు సర్వం సిద్ధం చేసుకోవచ్చు. కానీ, అట్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం లేదు.  ఖరీఫ్ కాలంలో  ఉత్తర రాష్ట్రాలలో  పంటకోత  ప్రారంభమయ్యే ముందు సాధారణంగా సెప్టెంబర్– అక్టోబర్  నెలల మధ్య లక్ష్యాలను ఖరారు చేసి ప్రకటిస్తారు. అదే రబీలో దక్షిణ రాష్ట్రాలలో  మే–-జూన్  నెలల సేకరణ కాలానికి ముందు,  మార్చి– ఏప్రిల్  నెలల మధ్య లక్ష్యాలను  అంచనావేసి తెలియజేస్తారు.  జాతీయ లక్ష్యం నిర్దేశించిన తర్వాత అది రాష్ట్రాలవారీగా నిర్దిష్ట కోటాలుగా  విభజిస్తారు.

ప్రతి సంవత్సరం నిర్దేశిస్తున్న సేకరణ లక్ష్యాలు కాగితంపై  పటిష్టంగా  కనిపించినప్పటికీ,  అమలు సమయంలో  కార్యాచరణ,  ప్రాకృతిక, ఆర్థిక అంతరాలు ఎదురవుతున్నాయి. ప్రణాళికాబద్ధమైన లక్ష్యాలకు, వాస్తవ సేకరణకు మధ్య వ్యత్యాసానికి పలు కీలక అంశాలు కారణమవుతున్నాయి.

ప్రకృతి  వైపరీత్యాలు (అకాల వర్షాలు, తీవ్ర ఎండలు, వగైరా),  కనీస మద్దతు ధర పెరిగినందుకు  లక్ష్యాల కుదింపు, గోదాముల కొరత,  రవాణా, తదితర సమస్యలు,  నిధుల కొరత (అప్పులు),  కేంద్రం లక్ష్యంతో  ముడిపడని రాష్ట్ర లక్ష్యాలు. ఈ మధ్య కొత్తగా సంచుల కొరత, తేమ కొలిచే యంత్రాలు సరిగా లేకపోవడం, సేకరణ కేంద్రాలలో కూలీలకు వేతనాలు సరిపోకపోవడం, లారీలు రాకపోవడం వంటి సమస్యలు సేకరణను ప్రహసనంగా మార్చుతున్నాయి.

అంతర్జాతీయ ఒత్తిళ్లు
జాతీయ పంటల సేకరణ లక్ష్యాల మీద కనపడని శక్తుల ప్రభావం ఉంటున్నది. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఎప్పటినుంచో భారత్ మీద ఒత్తిడి ఉన్నది. జాతీయ ఆహార పథకం కోసం చేస్తున్న ధాన్యాల సేకరణ, సేకరించి నిల్వ చేసుకోవడం వాణిజ్య పోటీని తగ్గిస్తుంది.

కనుక ఈ మొత్తం వ్యవస్థను తొలగించాలని అమెరికాలాంటి  దేశాలు మన దేశంమీద ఒత్తిడి పెంచుతున్నాయి. పైకి కేంద్ర ప్రభుత్వం స్పందించకున్నా  ప్రతి ఏటా నిర్దేశించే లక్ష్యాల మీద ఇలాంటి అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉంటున్నాయి.

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు, ఆయా ఒప్పందాలలో ఉన్న వివిధ అంశాలు కూడా వరి, గోధుమలు, ఇతర పంటల సేకరణ లక్ష్యాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వం  ప్రకటిస్తున్న అంశాలను చూస్తే ధాన్యం కొనుగోళ్లు రైతులకు చేస్తున్నట్టు భావించలేం. మార్కెట్లో బియ్యం ధరలను స్థిరీకరించడానికి చేస్తున్నారు.

1965లో  మొదలు పెట్టిన హరిత విప్లవం లక్ష్యాలు కూడా ఆహార భద్రత కేంద్రీకృతంగా  తయారుచేసిందే తప్పితే  రైతుల కోసం కాదు.  పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ధాన్యం కొనుగోళ్ల వ్యవస్థను మెరుగుపరచాలి.  రైతు తన ధాన్యం ప్రభుత్వానికి అప్పగించేందుకు పడే కష్టాల నివారణ దిశగా సేకరణ వ్యవస్థ పని చెయ్యాలి.

 పంట సేకరణ వ్యవస్థలో నిఘా పెరగాలి
దేశవ్యాప్తంగా ప్రతి సీజన్లో చేస్తున్న ధాన్యం కొనుగోళ్లమీద నిఘా, నియంత్రణ లేదు. భారత ఆహార సంస్థ 2025-–26 సమాచారం మేరకు 17రాష్ట్రాలలో 50 శాతం పైగా మిల్లింగ్ చేసిన బియ్యం మిల్లర్ల నుంచి రాలేదు.  తెలంగాణలో మిల్లింగ్ చేసిన బియ్యం రావలసినది 28.26 లక్షల మెట్రిక్ టన్నులు. 

అంతకు ముందు సంవత్సరం లెక్కలు జోడిస్తే రావాల్సిన బియ్యం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. పారదర్శక సమాచారం ప్రజలకు అందుబాటులో లేదు. అవినీతి స్పష్టంగా జరుగుతున్నది. ఈ వ్యవస్థలో అవినీతి తగ్గాలంటే  ఎక్కడికక్కడ పారదర్శకత పెరగాలి.

పంటసేకరణ వ్యవస్థలో నిఘా పెరగాలి.  రైతుల భాగస్వామ్యం పెంచాలి.  పంటల సేకరణ వ్యవస్థ మీద అత్యున్నత స్థాయిలో సమీక్ష చెయ్యాలి. పంటల సేకరణ వ్యవస్థ లక్ష్యాలలో ప్రాధాన్యతాక్రమంలో పంటలకు గిట్టుబాటు ధర అందించడం అన్నింటి కన్నా పైన ఉండాలి. 

వ్యవసాయ వాణిజ్యం విధానం ప్రకటిస్తూ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు ఈ సేకరణ వ్యవస్థకు లోబడి ఉండాలి. పంట సేకరణ  వ్యవస్థలో జవాబుదారీతనం పెంచాలి.  అక్రమాల మీద సమగ్ర విచారణ చేపట్టాలి.  ప్రభుత్వ నిధుల దుర్వినియోగం నిగ్గు తేల్చి బాధ్యులను శిక్షించాలి.

ఇథనాల్ ఉత్పత్తిపై కేంద్రం దృష్టి
వరి నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేసి వాహన ఇంధనంగా వాడాల్సిన వ్యవస్థ నిర్మాణం మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ లక్ష్యం జోడించడంతో  సేకరించిన ధాన్యం నిలువ, నాణ్యత మీద శ్రద్ధ ఇంకా తగ్గింది.  తేమ కొలిచే యంత్రాల ఉపయోగం కేవలం రైతు నుంచి సేకరించే  ధాన్యం పరిమాణం తగ్గించడానికే తప్పితే నాణ్యత కోసం కానే కాదు.

ధాన్యంలో తేమ 17 శాతం కంటే ఎక్కువ ఉంటే సేకరణ నిరాకరించే అధికార వ్యవస్థ  ప్రకటించిన ప్రమాణానికి ఉన్న శాస్త్రీయ  నిబద్ధత ఏనాడూ వెల్లడించలేదు. ఈ  ప్రమాణం కూడా  ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్కవిధంగా అమలు చేస్తున్నారు.

పంజాబ్లో మొదటి నుంచి తేమ శాతం 12 ఉన్నా తీసుకుంటున్నారు.  దీనిమీద 2011లో  దాదాపు 15 ఏండ్ల క్రితం శరద్ పవార్,  వ్యవసాయశాఖ మంత్రిని  ప్రశ్నిస్తే,  అధికారులను చూపించి సమాధానం దాటవేశారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయాలు,  నెపం ఇతరుల మీద పెట్టడం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.  ధాన్యం తడిస్తే ప్రభుత్వానికి నష్టం లేదు.

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం కూడా తీసుకుని ఇథనాల్ ఉత్పత్తికి వాడవచ్చు.  ప్రభుత్వం అది స్పష్టంగా చెప్పకుండా రైతులను గోస పెడుతున్నారు. ఆ మేరకు అయిన స్పష్టంగా  ప్రభుత్వం  ప్రకటిస్తే  రైతులు  కనీసం ఆందోళన పడకుండా ఉంటారు. 

డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ​ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.