వరంగల్ అభివృద్ధికి సర్కారు ప్రధాన్యం: దిశ సమావేశంలో లీడర్లు

వరంగల్ అభివృద్ధికి సర్కారు ప్రధాన్యం: దిశ సమావేశంలో లీడర్లు

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎంపీలు కడియం కావ్య, బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కె.ఆర్. నాగరాజు అన్నారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముఖ్య అతిథిగా, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి అధ్యక్షతన జరిగింది.  

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతు కిసాన్ మేళాల్లో గుర్తించిన సమస్యలను పరిష్కరించడంతో పాటు పంటల నిర్వహణ, ఎరువుల వినియోగం, పురుగుమందుల నియంత్రిత వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండింగ్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

గత దిశ సమావేశ నిర్ణయాల్లో కేవలం 20 శాతం మాత్రమే అమలయ్యాయని అసంతృప్తి వ్యక్తం చేసిన వారు, తదుపరి సమావేశానికి పురోగతి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో విద్య, వైద్య రంగాల బలోపేతం, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంపు, మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.  తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ మాట్లాడుతూ వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.  

వరంగల్ అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపుల కోసం సంబంధిత శాఖలు త్వరగా డీపీఆర్‌‌‌‌‌‌‌‌లు సిద్ధం చేసి సమర్పించాలని, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధించేందుకు కృషి చేస్తానని ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు.కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్లు జి. సంధ్యారాణి, వై.వి. గణేష్‌‌‌‌‌‌‌‌, జడ్పీ సీఈఓ రామ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, డీఆర్‌‌‌‌‌‌‌‌డీఓ నాగపద్మజ, వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సుమ, ఉమారాణితో పాటు వివిధ శాఖలకు చెందిన ఆఫీసర్లలు తదితరులు పాల్గొన్నారు. 

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 23 మంది ఎస్ఐలు బదిలీలు

గ్రేటర్​ వరంగల్​, వెలుగు: వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో తో పాటు వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 23 మంది ఎస్​ఐలను  వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్​ ప్రతీ సింగ్​ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో తొమ్మిది మంది మహిళ ఎస్సైలు ఉన్నారు.