
- భూముల అక్రమాల వ్యవహారాలు తేల్చనున్న ఫోరెన్సిక్ ఆడిట్
- రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ వంటి విలువైన ప్రాంతాల్లో భూముల గోల్మాల్
- గత ప్రభుత్వంలో నిషేధిత జాబితాలోని భూములు పట్టాలుగా మార్చినట్లు ఫిర్యాదులు
హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్‌లో చోటు చేసుకున్న అక్రమ లావాదేవీలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు కేరళకు చెందిన ప్రభుత్వ సంస్థను ఎంపిక చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో జరిగిన అక్రమ లావాదేవీల మూలాలను వెలికి తీయనున్నారు.
ధరణి వచ్చినప్పటి నుంచి రికార్డుల్లో చోటు చేసుకున్న మార్పులు, వాటికి గల ఆధారాలను క్షుణ్నంగా పరిశీలించనుంది. ప్రతి డిజిటల్ లావాదేవీని తనిఖీ చేయనున్నారు. ధరణి పోర్టల్ ముసుగులో ప్రభుత్వ, అసైన్డ్, అటవీ, వక్ఫ్, వివాదాలున్న అత్యంత విలువైన భూములను అక్రమార్కులు కొల్లగొట్టి, ఇతరుల పేర్ల మీదకు బదలాయించినట్టు ప్రభుత్వం ఆరోపిస్తున్నది. దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన భూములు అక్రమంగా చేతులు మారాయని మంత్రులు వివిధ సందర్భాల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన కొందరు.. అనుమానం రాకుండా ఉండేందుకు ఒకరి పేరు నుంచి మరొకరి పేరుకు మార్చినట్టు ప్రాథమికంగా గుర్తించారు. సిద్దిపేట జిల్లాలో ఇలాంటి ఘటనపై ఫిర్యాదు రావడంతో ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నది. అక్కడ దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని వివిధ కంపెనీల పేరు మీదకు మార్చినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
అనుమానం ఉన్న ప్రతి లావాదేవీ పరిశీలన
రాష్ట్రవ్యాప్తంగా అనుమానం ఉన్న ప్రతి లావాదేవీని పరిశీలించనున్నారు. 2014 కంటే ముందు ఉన్న నిషేధిత భూముల జాబితాను ప్రామాణికంగా తీసుకోనున్నారు. ‘‘ఆ జాబితాలోని భూముల్లో ఎన్ని పట్టా భూములుగా మారాయి? ఎందుకు మారాయి? కోర్టు ఉత్తర్వుల పరిస్థితి ఏమిటి? కోర్టు ఉత్తర్వులను సవాలు చేశారా? అసలు కోర్టు ఉత్తర్వులు నిజమైనవేనా? మాజీ సైనికుల పేరిట మార్చిన భూముల్లో ఎన్ని అసలైనవి ఉన్నాయి? అర్ధరాత్రి తర్వాత ఏయే లావాదేవీలు జరిగాయి? ఏ కంప్యూటర్ నుంచి జరిగాయి?అనుమతి ఇచ్చింది ఎవరు?”లాంటి అంశాలను సాంకేతిక సమాచారంతో సరిపోల్చి నిర్ధారించనున్నారు. అక్రమాలు జరిగాయని తేలితే సదరు భూములను స్వాధీనం చేసుకుని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు
ఇప్పటికే జిల్లాల్లోని అక్రమ భూ బదలాయింపులపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. ‘‘భూములు ఎవరెవరు ఎలా మార్చుకున్నారు? అంతకుముందు ఆ భూమి వర్గీకరణ ఏమిటి? ఎలాంటి తప్పుడు పత్రాలు సృష్టించారు? ఎవరు కబ్జాలో ఉంటే ఎవరికి పట్టాలు వచ్చాయి?’’లాంటి పూర్తి వివరాలను ప్రజలు ఆధారాలతో సహా ప్రభుత్వానికి అందజేశారు. ధరణిపై నియమించిన కమిటీకి కూడా పోర్టల్‌లోని అక్రమాలపై సమాచారం అందింది.
ధరణిలోని అక్రమాలను మరింత సులువుగా గుర్తించేందుకు 2014 కంటే ముందున్న ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ, భూదాన్, అసైన్డ్ భూముల వివరాలను సేకరిస్తున్నారు. ఆ డేటాను ప్రామాణికంగా తీసుకుని, 2014 తర్వాత ఏయే భూములు ఎవరెవరికి మారాయి? ఏ విధంగా బదిలీ అయ్యాయి? 2020లో ధరణి పోర్టల్ వచ్చాక ఎలాంటి మార్పులు జరిగాయి? అందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియలు ఏమిటి? అనే విషయాలపై సమగ్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించనున్నారు.
ఆడిట్ బృందానికి స్వయం ప్రతిపత్తి!
ఫోరెన్సిక్ ఆడిట్ బృందానికి పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఎంపిక చేసే నిపుణుల బృందంపై ఎవరి ఒత్తిడి లేకుండా, జరిగిన వాస్తవాలను నిగ్గు తేల్చేలా చర్యలు తీసుకోనున్నది. జిల్లాలవారీగా భూముల ఆడిటింగ్ కోసం రెవెన్యూ శాఖలోని ఉన్నతస్థాయి అధికారుల ప్రమేయం లేకుండా, నేరుగా ఆయా జిల్లాల కలెక్టర్లతో ఈ నిపుణుల బృందాలను అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఫోరెన్సిక్ ఆడిటింగ్ బాధ్యతలు అప్పగించేందుకు 4 కంపెనీలు ముందుకొచ్చాయి.
రెవెన్యూ వ్యవహారాలు, సాఫ్ట్‌వేర్ అంశాల్లో ఆ కంపెనీల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని కేరళ ప్రభుత్వ సంస్థను ఎంపిక చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇప్పటికే ధరణి పోర్టల్ ను ప్రభుత్వం పక్కన పెట్టి.. భూ భారతిలో భూముల లావాదేవీలు, వివరాల మార్పులు కొనసాగిస్తున్నది. భూదాన్, దేవాదాయ, అసైన్డ్, అటవీ, ప్రభుత్వ భూముల్లో జరిగిన కుంభకోణాలన్నీ ఈ ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెలుగు చూస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఎకరా వందల కోట్ల రూపాయలు పలికిన ప్రాంతాల్లో భూ బాగోతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.