మే 20 నుంచి జూన్​ 3 మధ్య టీఎస్​ టెట్

మే 20 నుంచి జూన్​ 3  మధ్య టీఎస్​ టెట్
  • ఈ నెల 27 నుంచి ఏప్రిల్10 వరకు దరఖాస్తులు
  • నోటిఫికేషన్​ రిలీజ్​.. ఈ నెల 20 డిటైల్డ్​ నోటిఫికేషన్​ 
  • డీఎస్సీ అప్లికేషన్ల గడువు జూన్​ 20 వరకు పెంపు
  • తాజా టెట్​లో క్వాలిఫై అయ్యే వాళ్లకూ చాన్స్​
  • జులై 17 నుంచి 31 వరకు డీఎస్సీ రాత పరీక్షలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరోసారి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్​ (టెట్) నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. మే 20 నుంచి జూన్ 3 మధ్యలో ఆన్​లైన్​లో టెట్ పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన టీఎస్​ టెట్–2024 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 11,062 టీచర్​ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే.. డీఎస్సీ రాయాలంటే టెట్ క్వాలిఫై తప్పనిసరి. 

గతంలో నిర్వహించిన టెట్​లో చాలామంది క్వాలిఫై కాకపోవడంతో, అయినవాళ్లు తక్కువ మార్కులతో గట్టెక్కడంతో మరోసారి టెట్ నిర్వహించాలని అభ్యర్థులు సర్కారుకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గురువారం విద్యాశాఖ అధికారులతో సమావేశమై.. టెట్ నిర్వహించాలని ఆదేశించారు. దీంతో గురువారం రాత్రి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్​లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 20న డిటెయిల్డ్ నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్​ను అధికారులు రిలీజ్​ చేయనున్నారు. 

భారీగా దరఖాస్తులు వచ్చే చాన్స్​

టెట్ మార్కులకు 20% డీఎస్సీలో వెయిటేజీ ఉంది. ఈసారి భారీగా టీచర్​ పోస్టులు ఉండటంతో, క్వాలిఫై అయిన వాళ్లూ మళ్లీ స్కోర్ పెంచుకునేందుకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. వీరితో పాటు టీచర్ల ప్రమోషన్లకూ టెట్ క్వాలిఫై తప్పనిసరి కావడంతో, టీచర్లూ భారీగా పరీక్షకు అటెండ్ అవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ బల్మూరి

టెట్ నిర్వహణకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించేలా  ప్రభుత్వం జీవో ఇచ్చిందని,  దీంతో 3 లక్షల మంది నిరుద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం  నిరుద్యోగుల పక్షాన ఉంటుందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. 

డీఎస్సీ అప్లికేషన్ల గడువు జూన్​ 20 

రాష్ట్రంలో జులై 17 నుంచి 31 వరకు డీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ప్రకటించారు. ఫిబ్రవరి 29న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 4 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఏప్రిల్ 3 వరకు అప్లై చేసుకునేందుకు ముందుగా అవకాశం ఇచ్చారు. అయితే, ప్రస్తుతం టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినందున డీఎస్సీ దరఖాస్తుల గడువును జూన్ 20 వరకు పొడిగించారు. డీఎస్సీ కోసం గురువారం సాయంత్రం వరకు 18 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి.