సర్కారు బడుల్లో క్లాస్ రూమ్​లు, టీచర్ల కొరత

సర్కారు బడుల్లో  క్లాస్ రూమ్​లు, టీచర్ల కొరత

హైదరాబాద్, వెలుగు: సిటీలోని గవర్నమెంట్ ​స్కూళ్లలో క్లాస్ రూమ్​లు, టీచర్ల కొరత వేధిస్తోంది. హైదరాబాద్ ​జిల్లా పరిధిలో 690 గవర్నమెంట్ స్కూల్స్ ఉండగా అందులో దాదాపు 30 నుంచి 40 శాతం స్కూళ్లకు ఈ ఏడాది అడ్మిషన్లు అధికంగా వచ్చాయి. ప్రస్తుతం ఇంకా వస్తున్నాయి. వీటిలో అంబర్‌‌‌‌పేట, ఖైరతాబాద్, మారేడ్‌‌పల్లి, తిరుమలగిరి, సైదాబాద్, షేక్‌‌పేట, రాజ్‌‌భవన్, బోరబండ, యూసఫ్‌‌గూడ, శ్రీరామ్‌‌నగర్‌‌‌‌, అమీర్‌‌‌‌పేట, బంజారాహిల్స్ స్కూళ్లు ఉన్నాయి. స్కూళ్లు మొదలై నెల కావొస్తున్నా ఇప్పటికీ ప్రతిరోజు అడ్మిషన్ కావాలని తల్లిదండ్రులు సర్కారు బడి బాట పడుతూనే ఉన్నారు. కానీ చేర్చుకునేందుకు హెడ్​మాస్టర్లు వెనకడుగు వేస్తున్నారు. సరిపడా విద్యార్థుల సంఖ్యకు సరిపడా టీచర్లు, క్లాస్ ​రూమ్​లు లేకపోవడమే ఇందుకు కారణం. 

రూమ్‌‌లు లేక

ప్రతి క్లాసులో 60 నుంచి 100 మంది పిల్లలు, కొన్నిచోట్ల అంతకు మించి ఉన్నారు. వీరందరిని కూర్చోబెట్టడమే టీచర్లు, హెచ్‌‌ఎంలకు పెద్ద టాస్క్ గా మారింది. ప్రైమరీ స్కూల్ కి ఆరు, హైస్కూల్‌‌ కి 12 క్లాస్‌‌ రూములు ఉన్నాయి. ఇవి కాకుండా సూన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, హెచ్‌‌ఎం, స్టాఫ్ రూమ్, కొన్ని చోట్ల లైబ్రరీలు ఉంటాయి. మాములుగా ఒక్కో క్లాస్‌‌లో బెంచీకి ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు. కానీ కొన్నిస్కూళ్లలో ఒక్కో బెంచీకి నలుగురి చొప్పున కూర్చోబెట్టినా ఇంకా పిల్లలు మిగిలిపోతున్నారు. వారిని వరండాలు, సైన్స్, కంప్యూటర్ ల్యాబుల్లో కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. మణికొండలోని జడ్పీహెచ్​ఎస్​లో 2 బెంచీలను దగ్గరగా వేసి కూర్చోబెడుతున్నారు. ఒక్కో క్లాస్‌‌లో 50 నుంచి 70 మందికి ఉన్నారు. ప్రస్తుతం ఆరు, ఎనిమిది, పదో తరగతుల్లో స్టూడెంట్స్ సంఖ్య వందపైనే ఉంది. పదో తరగతిని సెక్షన్లు చేసి కూర్చోబెట్టారు. మిగతా క్లాసులను డివైడ్ చేయడానికి రూములు లేవని టీచర్లు చెబుతున్నారు.

అక్కడ నో అడ్మిషన్​బోర్డు

బోరబండ హైస్కూల్‌‌ని షిఫ్టుల వారీగా నడిపిస్తున్నారు. ఇక్కడ ఆరో తరగతిలోనే కొత్తగా 400 పైనే అడ్మిషన్లు అయ్యాయి. ఏడెనిమిది సెక్షన్లు పెట్టి క్లాసులు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం 700 – 800 మంది, మధ్యాహ్నం 1,500 నుంచి రెండువేల మంది విద్యార్థులు స్కూలుకు వస్తున్నారు. సరిపడా టీచర్లు లేరు. 20 మంది విద్య వలంటీర్ల అవసరముందని టీచర్లు చెబుతున్నారు. ఇప్పటికీ డైలీ అడ్మిషన్ల కోసం పిల్లలు వస్తుండడంతో బోరబండ హైస్కూల్​లో నో అడ్మిషన్ బోర్డు పెట్టేరు. రాజీవ్‌‌ గాంధీనగర్,  హైమావతినగర్‌‌‌‌, బహదూర్​పురా స్కూళ్లలో ఒక్కరే టీచర్​ ఉన్నారు. రాజ్‌‌భవన్ స్కూల్ లోనూ టీచర్ల కొరత వెంటాడుతోంది. సిటీలోని ప్రభుత్వ బడుల్లో 6 వేల మంది టీచర్లు ఉన్నారని దాదాపు 700 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు డీఈఓ రోహిణి తెలిపారు. ఐదారుగురు టీచర్లు ఉండాల్సిన చోట ఒక్కరే ఉన్నారు. హిందీ టీచర్ల కొరత ఎక్కువగా ఉంది. హెచ్‌‌ఎంలు ఎన్జీఓలను, వలంటీర్లను సంప్రదిస్తున్నారు. 

మరో 12 గదులు నిర్మిస్తామన్నరు

మాది ప్రైమరీ, హై స్కూల్. పుప్పాలగూడ, దర్గా, అల్కాపురి, షేక్​పేట నుంచి స్టూడెంట్లు వస్తుంటారు. ప్రస్తుతం స్కూల్‌‌లో 1,170 మంది ఉన్నారు. కొత్తగా 390 అడ్మిషన్లు వచ్చాయి.12 క్లాస్‌‌ రూమ్‌‌లు ఉన్నాయి. పిల్లల సంఖ్య పెరగడంతో ఇవి సరిపోవడం లేదు. ‘మన బస్తీ – మన బడి’ మరో 12 క్లాస్‌‌ రూమ్‌‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. అందుకు ఇక్కడున్న ప్రైమరీ స్కూల్ షిఫ్ట్ అయితే 6  రూమ్స్​ అందుబాటులోకి వస్తాయి. -‌‌‌‌ నిరంజన్, హెచ్‌‌ఎం, మణికొండ హై స్కూల్ 

షిఫ్టులుగా మార్చినా గదులు సరిపోవట్లా

మా స్కూల్‌‌లో అడ్మిషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉదయం, మధ్యాహ్నం అని షిఫ్టుల వారీగా క్లాసులు నిర్వహించినా స్టూడెంట్లకు సరిపోవడం లేదు. నో అడ్మిషన్ బోర్డు పెట్టినా కూడా డైలీ సీట్ల కోసం పిల్లలు వస్తూనే ఉన్నారు. టీచర్ల కొరత కూడా ఎక్కువగానే ఉంది. - శ్యామ్ సుందర్, టీచర్, బోరబండ, యూటీఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు