వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలె

వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలె

మంచిర్యాల, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్​తోనే మంచిర్యాలతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాలు మునిగిపోయాయని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గోదావరిపై బ్యారేజీలు కట్టకముందు ఈ స్థాయిలో ఎన్నడూ వరదలు రాలేదన్నారు. జీవితకాలం కష్టపడి సంపాదించుకున్నదంతా వరదల్లో కొట్టుకుపోవడంతో ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

గురువారం ఆయన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ముంపు ప్రాంతాలైన రాంనగర్, ఎన్టీఆర్​నగర్​ను సందర్శించారు. ఇల్లిల్లూ తిరిగి ముంపు బాధితుల కష్టనష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గోదావరికి భారీగా వరదలు వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యిందన్నారు. ముంపు ప్రాంతాల్లో శానిటేషన్ అధ్వానంగా ఉందని, అంటురోగాలు ప్రబలుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శాశ్వత ముంపు నివారణ చర్యలను చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై వివిధ పార్టీల ప్రతినిధులు, నిపుణులతో వచ్చే నెల 4న రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు.