- మంచిర్యాలలో 11, ఆసిఫాబాద్‌లో 37, నిర్మల్ 14, ఆదిలాబాద్‌లో 8
- భూముల సరిహద్దుల నిర్ణయం, కొత్తగా మ్యాపుల తయారీ
- భూసమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా సర్కారు చర్యలు
మంచిర్యాల, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా నక్షాలు లేని 413 గ్రామాల్లో త్వరలోనే రీసర్వే నిర్వహించి కొత్త నక్షాల తయారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే గెజిట్ రిలీజ్ చేయగా జనవరిలో సర్వే ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ మేరకు రెవెన్యూ, ల్యాండ్ రికార్డ్స్ అండ్సర్వే యంత్రాంగం ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నక్షాలు అందుబాటులేని 70 గ్రామాల్లో రీసర్వే నిర్వహించనున్నారు. ఈ జాబితాలో అత్యధికంగా కుమ్రం భీం ఆసిఫాబాద్జిల్లాలో 37 గ్రామాలు ఉండగా, నిర్మల్‌లో 14, మంచిర్యాలలో 11, ఆదిలాబాద్‌లో ఎనిమిది గ్రామాలున్నాయి.
పైలట్ గ్రామాల్లో ఇప్పటికే సర్వే పూర్తి
భూముల రీసర్వే ద్వారా ఆయా భూములకు కచ్చితమైన హద్దులు నిర్ణయించడంతో పాటు సర్వే నంబర్ల వారీగా కొత్తగా మ్యాప్‌లను రూపొందించనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే రాష్ట్రంలోని ఐదు గ్రామాల్లో సర్వే నిర్వహించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్మండలం కోమన్‌పల్లి, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, సంగారెడ్డి జిల్లా వల్పల్లి మండలంలోని సాహెబ్‌నగర్, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నూగూరు, మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్‌లో ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ పద్ధతిలో సర్వే నిర్వహించి భూముల సరిహద్దులను గుర్తించి మ్యాప్‌లు రూపొందించారు. ఇదే విధంగా నక్షాలు లేని 413 గ్రామాల్లో సర్వే చేపట్టనున్నారు. ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఉందనే లెక్కలు తేల్చనున్నారు. ఈ సర్వే సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రీ సర్వే నిర్వహించనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.
భూసమస్యలకు శాశ్వత పరిష్కారం
రీసర్వే ద్వారా గ్రామాల్లోని భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రతి కమతానికి ప్రత్యేకంగా మ్యాప్ అందుబాటులోకి రావడంతో ల్యాండ్సర్వే సులభతరం కానుంది. ఇకపై భూ భారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే డిజిటల్సర్వే మ్యాప్‌లను పొందే అవకాశం ఉంటుంది. భూముల సరిహద్దు వివాదాలకు ఆస్కారమే ఉండదు. దీంతో పాటు గవర్నమెంట్, ఫారెస్ట్, ఎండోమెంట్, వక్ఫ్ భూముల సరిహద్దులపై క్లారిటీ వస్తుంది. పొరుగు భూముల యజమానులతో వచ్చే గొడవలకు అడ్డుకట్ట పడటమే కాకుండా భూముల క్రయవిక్రయాల్లో మోసాలు సైతం తగ్గుతాయని భావిస్తున్నారు.
రీసర్వేకు ఎంపిక చేసిన గ్రామాలివే..
ఆసిఫాబాద్ జిల్లా: భట్పల్లి(బెజ్జూర్ మండలం), దొంగర్గావ్(తిర్యాణి), వాడిగొండి, దానాపూర్, సుద్దాఘాట్, ఎడసగుండి, కుటోడ, సిరస్గావ్(ఆసిఫాబాద్), లంజన్వీర(వాంకిడి), బందెపల్లి(చింతలమానెపల్లి), (కెరమెరి), చందారం(కౌటాల), భోగారం, పోలంపల్లె, కమ్మర్పల్లి(దహెగాం), చింతకుంట(సిర్పూర్టౌన్), శంకరగూడ(కెరమెరి), ఇందాపూర్(కెరమెరి), రవీంద్రనగర్(చింతలమానేపల్లి), గార్లపేట, టోకిని(సిర్పూర్ టౌన్), సీతానగర్, నజ్రుల్‌నగర్(కాగజ్‌నగర్), కోత, లకంపూర్, ఆరికెపల్లి, అంతాపూర్, ఇసాపూర్, గౌరీ, ఆరెపల్లి, భోలెపత్తూర్, పరస్వాడ, అనార్పల్లి, నర్సాపూర్(కెరమెరి), జెండగూడ (జైనూర్), తెల్గపల్లి (పెంచికల్‌పేట).
మంచిర్యాల జిల్లా: చిన్నవెంకటాపూర్, పుప్పాలవానిపేట(నెన్నెల), తంగళ్లపల్లి(భీమిని), రాంపూర్(తాండూర్), కొత్తపల్లి(వేమనపల్లి), ఆడ్కపల్లి, కావర్ కొత్తపల్లి(కోటపల్లి), కిష్టంపేట(చెన్నూర్), పారుపల్లి(కోటపల్లి), మద్దికల్(భీమారం), చెన్నూరు.
నిర్మల్ జిల్లా: వాపూర్ రూరల్(ఖానాపూర్), రేవోజీపేట(దస్తురాబాద్), దంతంపల్లి(మామడ), మల్లాపూర్(లక్ష్మణచాంద), కౌట్ల బుజుర్గ్, నాగపూర్(సారంగాపూర్), తురాటి(నర్సాపూర్(జి), లబ్డి(బాసర), చాకెపల్లి(నర్సాపూర్జి), వెల్మల్(సోన్), తానూర్, వాలెగావ్(భైంసా), ఇస్లాంపూర్(కడెం), బామ్ని(కె)(లోకేశ్వరం).
ఆదిలాబాద్ జిల్లా : వడ్గల్పూర్, బుజుర్గ్(ఉట్నూర్), పోచంపల్లి, లచింపూర్(కె), లచింపూర్(బి)(సిరికొండ), మాన్కాపూర్(పి)(బజార్హత్నూర్), చిక్డారి ఖానాపూర్(ఆదిలాబాద్ రూరల్), బుద్దికొండ (నేరడిగొండ).
