ప్రొటోకాల్​పై గవర్నర్​ను బీఆర్​ఎస్​ కలవడం విడ్డూరం

ప్రొటోకాల్​పై గవర్నర్​ను బీఆర్​ఎస్​ కలవడం విడ్డూరం
  • పదేండ్లు గవర్నర్ వ్యవస్థను అవమానించారు: విప్ అయిలయ్య

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగానికి అసలు విలువే ఇవ్వని బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌‌ను కలవడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థను అవమానించి ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలని గవర్నర్ పదవిలో ఉన్న రాధాకృష్ణన్​ను కలవటం సిగ్గుచేటని శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. 

‘‘ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మహిళా గవర్నర్ తమిళిసైకి ప్రొటోకాల్ ఇవ్వకుండా అవమానించారు. పార్టీ నేతలతో సోషల్ మీడియాలో విమర్శలు చేయించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను సెక్రటేరియెట్ లోకి కూడా అనుమతించలేదు. అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. అధికార మదంతో ఆనాడు విర్రవీగి.. ఇప్పుడు రాజ్ భవన్ గేట్ ముందు కేటీఆర్ హాహాకారాలు చేస్తున్నాడు.  ప్రొటోకాల్ గురించి తెగ గింజుకుంటున్నాడు. అప్పుడు గవర్నర్ వ్యవస్థను అవమానించి, ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలని కోరడం ఏమిటి? ’’ అని అయిలయ్య ప్రశ్నించారు.