
- ఇప్పుడు ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయని కలలు కంటుండు : ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు : గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు రాకుండా చిత్తుగా ఓడించినా బీఆర్‌ఎస్‌కు సిగ్గురావడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే తమకు వంద సీట్లు వస్తాయని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు కలలు కంటున్నారని, రెండు నెలల కింద జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితి ఏమైందో మరిచిపోయారా అని ప్రశ్నించారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. జనం బీఆర్ఎస్‌ను జీరో చేసి విసిరి అవతల పారేసినా.. వంద సీట్లు వస్తాయని కలలు కంటున్నారని విమర్శించారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనం ఛీకొట్టినా సిగ్గురాలేదా అని ఫైర్ అయ్యారు. భవిష్యత్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీని రాష్ట్రం నుంచే తరిమేస్తారన్నారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ ముఖం కూడా చూడరని, ప్రతిపక్ష నేతగా ఉండమని జనం ఓట్లేస్తే ఫామ్ హౌస్‌లో నిద్రపోతున్నరని ఎద్దేవా చేశారు. కేటీఆర్, ఆయన బావమరిది ఫామ్ హౌస్‌లో చేస్తున్న పాడు పనులను జనం గమనిస్తున్నారని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, తెలంగాణ డ్రగ్స్‌కు అడ్డాగా మారుతుందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ చేయలేకపోతున్నారని అంటున్న హరీశ్ రావు.. రెండోసారి కేసీఆర్ గెలిచాక 3 నెలలు మంత్రులు లేకుండా పరిపాలించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ‘‘నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఏడ్చుకుంటూ ఫామ్ హౌస్‌లో నిద్రపోయినది నిజం కాదా..? రేవంత్ రెడ్డి కుర్చీకి ఏమీ కాదు. ఆ కుర్చీని టచ్ చేసే వాళ్లు పుట్టలేదు. మీ మామ కుర్చీ లాగి ఫామ్ హౌస్‌లో నిద్రపుచ్చింది రేవంత్ రెడ్డి అన్న విషయం మర్చిపోయారా. రాష్ట్రంలో మళ్లీ గెలిచేది కాంగ్రెస్ పార్టీయే. రేవంత్ రెడ్డే సీఎం’’ అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.