లక్ష మాఫీని ఐదేండ్లు సాగదీసిన మీరా మాట్లాడేది?: ఆది శ్రీనివాస్

లక్ష మాఫీని ఐదేండ్లు సాగదీసిన మీరా మాట్లాడేది?: ఆది శ్రీనివాస్
  • హరీశ్​రావుపై ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ ఫైర్​
  • రేషన్​ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తున్నం
  • రైతులు సంతోషంగా ఉంటే హరీశ్​ రావు ఉక్కిరిబిక్కిరైతున్నడు
  • గత సర్కార్​ తీరు వల్లే కొందరికి రుణమాఫీ ఆలస్యం
  • అర్హులందరికీ అమలు చేసి తీరుతామని ప్రకటన

హైదరాబాద్, వెలుగు: లక్ష రుణమాఫీని ఐదేండ్లు సాగదీసిన బీఆర్​ఎస్ నేతలు.. అధికారంలోకి వచ్చిన ఆరేడు నెలల్లోనే రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన తమ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రుణమాఫీని అమలు చేయడంతో రైతులు సంతోషంగా ఉన్నారని, దీన్ని భరించలేక హరీశ్​రావు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. రేషన్​ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. గతంలో బీఆర్​ఎస్​ సర్కార్​ చేసిన తప్పుల వల్లే కొంత మంది రైతులకు రుణమాఫీ ఆలస్యమవుతున్నదని ఆదివారం ఆయన మీడియాతో అన్నారు. తాము కొత్తగా ఎలాంటి రూల్స్ పెట్టలేదని చెప్పారు.   రైతులను రెచ్చగొట్టడమే హరీశ్​రావు పనిగా పెట్టుకున్నారన్నారు. ‘‘రైతుబంధు పేరు జెప్పి మిగతా స్కీంలన్నీ గత బీఆర్​ఎస్​ సర్కార్​ పక్కనపెట్టింది. పదేండ్లు లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే నష్టపరిహారం ఇవ్వలేదు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వలేదు. రైతుల సబ్సిడీలన్నింటిని ఎత్తివేసిన చరిత్ర గత కేసీఆర్ సర్కార్ ది.  రైతుల గురించి బీఆర్ఎస్ నాయకులు, హరీశ్​రావు , కేటీఆర్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. హరీశ్​రావు పిచ్చి ప్రేలాపనలు ఆపాలి. రైతులను రెచ్చగొట్టడానికి హరీశ్​ రావు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు” అని ఆయన అన్నారు. 

జనంలోకి ప్రతిపక్ష నేత ఎందుకు పోతలే?

రాష్ట్రం వరదలతో అతలాకుతలమై జనం ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్​ ఎందుకు జనంలోకి వెళ్లడం లేదని, ఎందుకు పరామర్శించడం లేదని ఆది శ్రీనివాస్​ ప్రశ్నించారు. ‘‘ పంట నష్టంతో రైతులు ఆందోళనలో ఉంటే..  ఒక్కరినైనా కేసీఆర్​ పరామర్శించారా? రుణమాఫీ పై కూడా స్పందించలేదు. రైతులకు మంచి జరిగితే కూడా అభినందించలేని బిజీలో ఉన్నడు. మామ ఫామ్​హౌస్​లో, బామ్మర్ది అమెరికాలో జల్సా చేస్తుంటే.. రుణమాఫీ కాలేదని, ప్రభుత్వం పట్టించుకోట్లేదని ప్రజలను అల్లుడు(హరీశ్​) రెచ్చగొడుతున్నడు” అని ఆయన మండిపడ్డారు.