- బీఆర్ఎస్ లీడర్లు రెచ్చగొడ్తున్నరు
- కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు: విప్ అడ్లూరి
హైదరాబాద్, వెలుగు: మూసీ నిర్వాసితులను బీఆర్ఎస్ లీడర్లే రెచ్చగొడ్తున్నారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రివర్ బెడ్లో నివాసం ఉంటున్న వాళ్లంతా స్వచ్ఛందంగా తమ ఇండ్లు ఖాళీ చేస్తున్నారని తెలిపారు. నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నామన్నారు. సీఎల్పీ మీడియా పాయింట్లో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు భూ నిర్వాసితులను కేసీఆర్ పట్టించుకోలేదు. వారి కష్టాల గురించి అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లీడర్లు మాట్లాడలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతులను బెదిరించి భూములు లాక్కున్నరు.
నిర్వాసితులను కలవనివ్వకుండా అపోజిషన్ పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎకరం 30 లక్షలు పలికే భూములను తక్కువ రేటుకు గుంజుకున్నరు’’అని అడ్లూరి అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో 2వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకున్నారని, నిర్వాసితుల తరఫున కాంగ్రెస్ పోరాడితే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నిర్వాసితుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదు. హైదరాబాద్ నాలాలపై 28వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని సీఎంగా ఉన్నప్పుడు కేసీఆరే చెప్పిండు. బీఆర్ఎస్ లీడర్లంతా సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నరు. నాయకత్వం కోసం కేటీఆర్, హరీశ్ రావు పోటీపడుతూ హడావుడి చేస్తున్నరు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై చర్చకు వచ్చే దమ్ము కేటీఆర్కు ఉందా? ’’అని అడ్లూరి సవాల్ విసిరారు.