కార్మికులు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి గంగుల

కార్మికులు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి గంగుల

భవన నిర్మాణ, కార్మిక సంక్షేమ బోర్డు సహకారంతో ముంబైయి సీఎస్సీ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో 140 రకాల వైద్య, రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. కరీంనగర్ లో కార్మికుల కోసం ఉచిత వైద్య పరీక్షల ల్యాబోరేటరీని ప్రారంభించిన గంగుల కమలాకర్... కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా... కేవలం రాష్ట్ర ప్రభుత్వమే ఈ పరీక్షలు నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. వ్యాధిని ముందుగా గుర్తిస్తే చికిత్స సులువవుతుందన్న ఆయన... ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క భవన నిర్మాణదారుడికి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అందుకోసం తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి 7 ల్యాబ్ లు  ప్రారంభించామని ఆయన వివరించారు. కరీంనగర్ ల్యాబ్ లో కరీంనగర్ జిల్లాతో పాటు ఆసీఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు చెందిన కార్మికులకు సైతం పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు లక్ష మంది కార్మికులను గుర్తించామని మంత్రి గంగుల అన్నారు. ఇప్పటి వరకు ఎన్రోల్ చేసుకోనివారు త్వరగా నమోదు చేసుకోవాలని చెప్పారు. కార్మికుల నమోదు కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామన్న ఆయన.. ఈ పరీక్షలతో ప్రతి కార్మికుడిపై రూ.15 వేల ఆర్థిక భారం తప్పుతుందన్నారు. కార్మికులకున్న వ్యాధిని నిర్ధారించడం ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని మంత్రి తెలిపారు.
ప్రతి కార్మికుని నుంచి శాంపిల్ కలెక్ట్ చేసి పరీక్షిస్తామని చెప్పారు. వ్యాధి నిర్ధారణ అయినవారికి అవసరమైతే అధునాతనమైన వైద్య చికిత్సను అందిస్తామన్న గంగుల... ప్రతి కార్మికుడి పేరుతో హెల్త్ ప్రొఫైల్ రెడీ చేస్తామన్నారు. కార్మికులు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రతిరోజు సుమారు 3,500 శాంపిల్స్ ని కలెక్ట్ చేసి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వివరించారు.