స్కూల్​ మేనేజ్​మెంట్​ కమిటీల ఏర్పాటులో ప్రభుత్వాల నిర్లక్ష్యం

 స్కూల్​ మేనేజ్​మెంట్​ కమిటీల ఏర్పాటులో ప్రభుత్వాల నిర్లక్ష్యం

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలనే మంచి ఉద్దేశంతో చట్టబద్ధంగా అమలులోకి తీసుకొచ్చిన స్కూల్​మేనేజ్​మెంట్​కమిటీల ఏర్పాటులో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కొన్ని చోట్ల పేరుకే కమిటీలు వేస్తున్నారు కానీ.. వారిని పాఠశాల అభివృద్ధిలో క్రియాశీలకంగా భాగస్వామ్యం చేసే ప్రయత్నాలు జరగడం లేదు. విద్యాహక్కు చట్టం-2009లోని సెక్షన్19 సబ్ సెక్షన్(1) ప్రకారం ప్రతి పాఠశాలలో (గుర్తింపు పొందిన ప్రైవేట్ బడులు మినహా) స్కూల్​ మేనేజ్​మెంట్​కమిటీలను తప్పకుండా ఏర్పాటు చేయాలి. ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసిన యాజమాన్య కమిటీలను మండల విద్యాధికారి, ఇతర పాఠశాలల యాజమాన్య సంఘాలను జిల్లా విద్యాశాఖాధికారి రద్దు చేసేవరకు అవి కొనసాగుతాయి. తెలంగాణలో దాదాపు అన్ని బడుల్లో విద్యా కమిటీల ఏర్పాటు జరిగింది. అలాగే విద్యా కమిటీ చైర్మన్ ల ఎన్నికా పూర్తయింది. కానీ ఆ కమిటీలు ఏ మేరకు ప్రభుత్వ బడుల పురోభివృద్ధికి తోడ్పడుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

అలంకార ప్రాయమేనా?

విద్యాకమిటీలు అలంకారప్రాయంగా మా రాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి రెండు నెలలకొకసారి సమావేశమై పాఠశాల అవసరాలు, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల ఖాళీలు.. చదువులో విద్యార్థుల ప్రగతి తదితర అంశాల పట్ల ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన విద్యాకమిటీ చైర్మన్, సభ్యులు చర్చించాల్సి ఉంటుంది. కానీ సమావేశాలు చాలా పాఠశాలలల్లో కొనసాగడం లేదు. 2022- – 2023 విద్యా సంవత్సరం నుంచి ప్రతి నెలా మూడో శనివారం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. చాలా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు చొరవ తీసుకొని ఉదయం 7:30 కల్లా పాఠశాలకు హాజరై సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నా.. పేరెంట్స్ హాజరు కావడం లేదు. ఇక కొన్ని పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ నామమాత్రంగా కొనసాగుతున్నాయి. విద్యా కమిటీ చైర్మన్​లు కేవలం చెక్కులపై సంతకాలు చేయడం వరకే పరిమితమవుతున్నారు. దీంతో విద్యాకమిటీల ఏర్పాటు లక్ష్యం నీరుగారుతోంది. కొన్ని పాఠశాలల్లో నిర్వహించే స్వాతంత్ర్య, గణతంత్ర ఇతరత్రా వేడుకలకు మాత్రమే విద్యా కమిటీ చైర్మన్లు హాజరవుతున్నారు. ఇక సభ్యుల మాట సరేసరి. విద్యా కమిటీ ఎన్నికల రోజు పాఠశాలకు వస్తే మళ్లీ ఎన్నికల వరకు బడి దరిదాపులకు రానివారే ఎక్కువ మంది ఉంటున్నారు. 

ప్రభుత్వం చొరవ తీసుకోవాలి

ప్రతి రెండేండ్లకోసారి ఎన్నికలు నిర్వహించి నూతన విద్యా కమిటీని ఎన్నుకోవాల్సి ఉండగా  ఈ నెల 31 వరకు గతంలో ఏర్పడ్డ కమిటీని కొనసాగించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యాకమిటీ లను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలి. వారికి ప్రత్యేక శిక్షణా తరగతులను ఏర్పాటు చేసి గ్రామంలో వారు చేయాల్సిన పనులను తెలియజేయాలి. సాయంత్రం వేళల్లో విద్యార్థుల ఇంటికి వెళ్లి వారి చదువులను పరిశీలించేలా చొరవ తీసుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడే దిశగా వారిని కార్యోన్ముఖులను చేయాలి. ఆ దిశగా అడుగులు వేయగలిగిన నాడే ప్రభుత్వ బడులు కళకళలాడుతూ ముందుకు సాగుతాయి. 

- ఏ.వి. సుధాకర్,అసోసియేట్ అధ్యక్షుడు, ఎస్టీయూటీఎస్