సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం.. డీకేకు లైన్ క్లియర్

సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం.. డీకేకు లైన్ క్లియర్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. సీఎం పదవి నుంచి తప్పుకున్న ఆయన 2026 మే 28న (గురువారం) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామాకు గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ శుక్రవారం ఆమోదించారు. దీంతో డీకే శివకుమార్ కు లైన్ క్లియర్ అయ్యింది. 

కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకే సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ బెంగళూరులో లేకపోవడంతో తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయంలో సమర్పించారు. 

గురువారం ఉదయం గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ ఇండోర్ కు వెళ్లారు. అంతకు ముందు బెంగళూరు నుంచి ముంబై వెళ్లిన గవర్నర్.. ఇండోర్ కు వెళ్లారు.ఈ క్రమంలో గవర్నర్ లేకపోయినా.. ఆయన కార్యాలయంలోనే రాజీనామాను సమర్పించారు. శుక్రవారం (మే 29) రాజీనామాకు గవర్నర్ ఆమోదం లభించింది. 

  • ఏడాది క్రితం నుంచే డీకే వర్గం డిమాండ్..

కర్నాటక కాంగ్రెస్ లో ఈ నాయకత్వ సమస్య ఏడాదికిపైగా నలుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సిద్ధూ, డీకే మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో పార్టీ కేంద్ర నాయకత్వం రొటేషన్ పద్ధతిలో 2.5 ఏండ్ల తర్వాత సీఎం పదవిని ఇచ్చేలా డీకేకు హామీ ఇచ్చిందని, ఆ వాగ్దానం ప్రకారం.. ఇప్పుడు డీకేకు సీఎం కుర్చీ అప్పగించాలని ఆయన అనుచరులు ఏడాదికిపైగా డిమాండ్ చేస్తున్నారు.

అయితే, మైనారిటీ వర్గాలు, వెనుకబడిన తరగతులు, దళితులతో కూడిన అహిందా సమూహంలో సిద్ధరామయ్యకు ఉన్న మద్దతు దృష్ట్యా ఆయనను దింపేందుకు కాంగ్రెస్ తటపటాయించింది. సిద్ధూను దింపితే పక్క రాష్ట్రం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వొక్కలిగ లింగాయత్ వర్గం ఓట్లకు గండిపడుతుందని వాయిదా వేస్తూ వచ్చింది.

ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు కూడా ముగిసినందున సీఎం కుర్చీని ఇవ్వాల్సిందేనంటూ డీకే వర్గం మరింత బలంగా డిమాండ్ చేసిందని, దీంతో చివరకు హైకమాండ్ డీకేకు మద్దతు ఇచ్చిందని తెలుస్తోంది. మరోవైపు, సిద్ధరామయ్యకు జాతీయ స్థాయిలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసీసీ భావిస్తోంది. ఇందులో భాగంగానే సిద్ధూను పెద్దల సభకు పంపించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే, హైకమాండ్ ఇచ్చిన రాజ్య సభ ఆఫర్ ను సిద్ధరామయ్య తిరస్కరించినట్లు తెలిసింది. తనకు జాతీయ రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని.. కేవలం ఎమ్మెల్యేగానే కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.