కేటీఆర్ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. ఫార్ములా E-రేసు కేసులో కీలక మలుపు

కేటీఆర్ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. ఫార్ములా E-రేసు కేసులో కీలక మలుపు

హైదరాబాద్: ఫార్ములా E-కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ నుంచి అనుమతి లభించింది. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. ప్రజా ప్రతినిధిగా ఉన్నందు వల్ల కేటీఆర్ పై చర్యలకు గవర్నర్ నుంచి అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వం రాసిన లేఖపై స్పందిస్తూ.. గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ విచారణకు గురువారం అనుమతి ఇచ్చారు. దీంతో.. త్వరలో ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ ఎదుర్కోనున్నారు. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్పై త్వరలో చార్జిషీట్ నమోదు కానుంది. ఇప్పటికే ఈ కేసులో నాలుగు సార్లు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావడం గమనార్హం. 

బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫార్ములా ఈ-రేసింగ్ నిర్వహించింది. కేటీఆర్ అప్పటి మున్సిపాలిటీ మంత్రిగా ఉన్నారు. 2023లో హైదరాబాద్ నగరంలో ఫార్మూలా ఈ కార్ రేసింగ్లో చెల్లింపులు జరిగాయి.  రేసింగ్ రోడ్డు, ఇతర మౌళిక సదుపాయాల కోసం HMDA రూ. 20 కోట్లు ఖర్చు చేసింది. అదే విధంగా రేస్ ప్రమోటర్గా వ్యవహరించిన నెక్స్ట్ జెన్ అనే ఏజెన్సీ రూ.150 కోట్లు ఖర్చు చేసింది. ప్రచారంతో పాటు స్టాల్స్, సీటింగ్, స్ట్రీట్ లైట్స్ వంటి ఖర్చులను ఏజెన్సీనే భరించింది.

ఈవెంట్ విషయంలో HMDA, నెక్స్ట్ జెన్, ఈ ఫార్ములాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ రేసింగ్ నిర్వహణ వల్ల HMDA , నెక్స్ట్ జెన్ సంస్థలు ఎలాంటి లాభం రాకపోవడంతో నష్టపోయాయి. అయితే ఈ రేసుకు సంబంధించి ఉన్నతాధికారి అర్వింద్ కుమార్ రహస్య ఒప్పందం చేసుకుని రూ.55 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కేవలం ఫోన్ల ద్వారానే ఆదేశాలు అందుకుని నిధుల విడుదల చేసినట్లు తేలింది. మున్సిపాలిటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆమోదంతోనే నిధుల విడుదల జరిగిందనేది అభియోగం.

* ఫార్ములా-ఈ రేస్ కేసులో అత్యంత కీలక పరిణామం.. KTRకు బిగ్ షాక్
* కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు తెలంగాణ గవర్నర్ అనుమతి 
* ఇప్పటికే కేటీఆర్ను నాలుగు సార్లు, అరవింద్ కుమార్ను అయిదు సార్లు విచారించిన ఏసీబీ
* ఈ కేసులో కేటీఆర్ పాత్రకు సంబంధించి వందలాది డాక్యుమెంట్లను, ఈ-మెయిల్స్ను, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను, ఇతర సాక్ష్యాలను సేకరించిన ఏసీబీ
* తొమ్మిది నెలల పాటు పకడ్బందీగా అన్ని కోణాల నుంచి విచారణ
* ఎమ్మెల్యే అయిన కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేటందుకు అనుమతి కోరుతూ సెప్టెంబర్ 9న గవర్నర్కు లేఖ రాసిన ఏసీబీ 
* 10 వారాల తర్వాత గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్
* IAS అధికారి అర్వింద్ కుమార్ను ప్రాసిక్యూట్ చేసేందుకు DoPT అనుమతి కోసం ఎదురుచూస్తున్న ఏసీబీ
* అనుమతి రాగానే కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ ఎన్ రెడ్డిలపై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఏసీబీ