ఆదివాసీలు శక్తిమంతం కావాలి..అప్పుడే సమాజం గౌరవిస్తుంది : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ఆదివాసీలు శక్తిమంతం కావాలి..అప్పుడే సమాజం గౌరవిస్తుంది : గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ
  •     గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ సూచన
  •     అచ్చంపేటలో వైభవంగా ఆదివాసీల సామూహిక వివాహాలు 
  •     111 కొత్త జంటలను ఆశీర్వదించిన గవర్నర్

నాగర్ కర్నూల్, వెలుగు: ఆదివాసీలు శక్తిమంతంగా ఎదిగినప్పుడే సమాజం గౌరవిస్తుందని గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ అన్నారు. ఆదివారం నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేటలో ఆదివాసీ కళ్యాణ పరిషత్, రెడ్​క్రాస్​ సొసైటీ ఆధ్వర్యంలో 111 చెంచు, గిరిజన జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్  హాజరై కొత్త జంటలను ఆశీర్వదించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో 111 జంటలు ఒక్కటి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. చెంచుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని, చెంచులు శక్తివంతంగా తయారు కావాలన్నారు. తాను కూడా  ఆదివాసీ జాతికి చెందిన వాడినేనని, సామూహిక వివాహాలకు తాను సాక్షిగా ఉండటం గర్వంగా ఉందన్నారు.

 త్వరలో చెంచులను కలిసి అన్ని విషయాలు మాట్లాడుతానని చెప్పారు. ఆదివాసీ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారం 111 జంటలకు ఒకే వేదికపై వివాహం చేయడం అభినందనీయమని హైకోర్టు న్యాయమూర్తి మాధవీలత అన్నారు. కొత్త జీవితం ప్రారంభిస్తున్న జంటలకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహ బంధం పవిత్రతను అర్థం చేసుకుని కలకాలం కలిసుండాలని హితవు పలికారు. 

తాను ఈ ప్రాంత కోడలినేనని, కొత్త పెండ్లికూతుర్లు తనకు కూతుర్లవంటి వారన్నారు. వారికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. హర్యానా మాజీ గవర్నర్​ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ఆదివాసీ జంటల సామూహిక వివాహాలకు రాష్ట్ర గవర్నర్​ రావడం సంతోషంగా ఉందన్నారు. వనవాసీ కల్యాణ పరిషత్​ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్  హెచ్ కే బాపు, వనవాసీ కల్యాణ్​ ఆశ్రమ్​ ఉపాధ్యక్షురాలు డాక్టర్ రేఖ పాల్గొన్నారు.