కేరళలో లెఫ్ట్ ప్రభుత్వంపై గవర్నర్ ఖాన్ విమర్శ

కేరళలో లెఫ్ట్ ప్రభుత్వంపై గవర్నర్ ఖాన్ విమర్శ
  • బిల్లుల ఆమోదానికి తనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
  •  తనతో గేమ్స్ వద్దంటూ వార్నింగ్​

తిరువనంతపురం: అసమ్మతిని వ్యక్తం చేస్తున్న వారి గొంతు నొక్కేస్తున్నారని కేరళలోని ఎల్‌‌డీఎఫ్‌‌ (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌‌)  ప్రభుత్వంపై గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌‌ విమర్శలు చేశారు. సోమవారం మీడియా కాన్ఫరెన్స్‌‌లో మాట్లాడిన ఆయన 2019లో కన్నూర్ యూనివర్సిటీలో తనను ఎగతాళి చేసిన వీడియో క్లిప్పింగ్స్‌‌ను ప్రదర్శించారు. వర్సిటీల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను పంచుకున్నారు. యూనివర్సిటీల చాన్స్‌‌లర్‌‌‌‌గా తన అధికారాలకు కోత పెడుతూ బిల్ పాస్ చేసిన నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పనితీరు, ఆదాయం కోసం లాటరీలు, మద్యం అమ్మకాలపై ఆధారపడటాన్ని విమర్శించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వంతో విభేదిస్తున్న వారి గొంతులను అణచివేస్తున్నారు. ఈ విషయంలో రాజ్‌‌భవన్‌‌ను కూడా వదిలిపెట్టడం లేదు. దేశం బయటి నుంచి పుట్టుకొచ్చిన కొన్ని సిద్ధాంతాలు (కమ్యూనిస్ట్ భావజాలాన్ని ఉద్దేశిస్తూ).. అసమ్మతిని, అభిప్రాయ భేదాలను తొక్కేయడానికి, తమ శత్రువులుగా భావించే వారిని అంతం చేసేందుకు అధికార బలాన్ని ఉపయోగిస్తాయి” అని ఆరోపించారు.

యూనివర్సిటీ చట్టాలు, లోకాయుక్త సవరణ బిల్లులపై సంతకం చేసేలా ఒత్తిడి చేయడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని మండిపడ్డారు. ‘‘నాతో గేమ్స్ ఆడకండి. ఇప్పటికే చాలా చూశాను. నేను బిల్లులను ఆమోదిస్తూ సంతకాలు చేస్తే.. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడతారు. వాటిని కూడా ఆమోదించాలని అడుగుతారు. నేను అలా జరగనివ్వను. చాన్స్‌‌లర్‌‌‌‌ అధికారాలను లాగేసుకుంటూ.. వాళ్లు బిల్లును పాస్ చేస్తే నేను సంతకం పెడుతా. కానీ నేను చాన్స్‌‌లర్‌‌‌‌గా ఉండగా.. వాళ్లు చేసే అక్రమాలపై సంతకం చేయను” అని స్పష్టం చేశారు. మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు ప్రభుత్వ వ్యవహారాలను నడుపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆరోపించారు.