తొలి ప్రాధాన్యం నవరత్నాల అమలుకే: గవర్నర్

తొలి ప్రాధాన్యం నవరత్నాల అమలుకే: గవర్నర్
  • ఏపీ అసెంబ్లీ గవర్నర్ ప్రసంగం
  • విభజన హామీలకై కేంద్రంపై ఒత్తిడి తెస్తాం.
  • అవినీతి రహిత పాలనతో ఆదర్శంగా నిలుస్తాం
  • ప్రాజెక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ చేపడతాం.
  • YSR రైతు భరోసా క్రింద ప్రతీ రైతుకు రూ.12,500

అమరావతి: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో శుక్రవారం ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, హామీల అమలు గురించి తన ప్రసంగంలో వివరించారు.

తన ప్రసంగంలో.. విభజనచట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి చేస్తామని, విభజన సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. అవినీతి రహిత పాలన ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తామని,ప్రజాధనం వృథా కాకుండా అనేక చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం రివర్స్‌ టెండరింగ్‌ చేపడతామని తెలిపారు.

నవరత్నాల అమలు కోసం తొలి ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 62 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్నారు రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఫార్మర్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.12,500 ఇస్తామన్నారు. పగటిపూట వ్యవసాయానికి 9 గంటల కరెంట్‌ ఇస్తామన్నారు. రైతులకు వడ్డీలేని రుణాలు, ఉచిత బోరుబావులు వేయిస్తామని గవర్నర్ తెలిపారు. వైఎస్‌ఆర్‌ బీమా పథకం కింద రూ.7 లక్షలు ఇస్తామన్నారు. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి.. ఆరోగ్య సంరక్షణ సేవ కింద రూ.1000 అందిస్తామని గవర్నర్ స్పష్టం చేశారు.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10 వేల పెన్షన్ ఇస్తామని నరసింహన్ అన్నారు.