గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కథ .. మళ్లీ మొదటికి!

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కథ .. మళ్లీ మొదటికి!
  • వాళ్లను ఏ కోటాలో నామినేట్ చేశారో పేర్కొనలేదన్న తమిళిసై
  • గతంలో కౌశిక్ రెడ్డి ఫైలును పెండింగ్‌‌‌‌లోనే పెట్టిన గవర్నర్
  • మధుసూదనాచారి పేరు ప్రతిపాదిస్తూ మళ్లీ ప్రపోజల్ పంపాకే ఆమోదం
  • సర్కారు పేర్లు మార్చి పంపుతుందా? కేటగిరీపై క్లారిటీ ఇస్తుందా? అనే దానిపై ఆసక్తి

హైదరాబాద్, వెలుగు: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను గవర్నర్​కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ ​చేస్తూ రాష్ట్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోదించలేదు. చాలా రోజులుగా పెండింగ్‌‌‌‌లోనే పెట్టారు. గవర్నర్‌‌‌‌‌‌‌‌గా నాలుగేండ్ల పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం తమిళిసై మీడియాతో ఇంటరాక్ట్​అయ్యారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు అంటే రాజకీయ పదవులు కావన్నారు. ఇద్దరి పేర్లు గవర్నర్​ కోటాలో నామినేట్​ చేస్తున్నట్టుగా తనకు ప్రపోజల్​ వచ్చిందని, కానీ వారిని ఏ కేటగిరీలో నామినేట్​ చేస్తున్నారనేది పేర్కొనలేదని చెప్పారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై డైలమా నెలకొంది. 

హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో సోషల్ ​సర్వీస్​ కేటగిరీలో గవర్నర్​కోటా ఎమ్మెల్సీగా కౌశిక్​రెడ్డి పేరును నామినేట్​చేస్తూ రాష్ట్ర కేబినెట్ ​తీర్మానం చేసి పంపింది. అయితే దానికి ఆమోదం తెలుపకుండా గవర్నర్​పెండింగ్‌‌‌‌లో పెట్టారు. దీంతో కౌశిక్‌‌‌‌ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పంపిన బీఆర్ఎస్ సర్కారు.. ఆయన స్థానంలో మాజీ స్పీకర్​మధుసూదనాచారి పేరు ప్రతిపాదిస్తూ మళ్లీ రాజ్​భవన్​కు ప్రపోజల్ పంపింది. దీనికి గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపారు.

ఆమోదం అనుమానమే

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయిన దాసోజు శ్రవణ్​గతంలో ప్రొఫెసర్​గా పని చేశారు. ఆ తర్వాత పీఆర్పీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తిరిగి బీఆర్ఎస్​లోకి వచ్చారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ ఎరుకుల కులానికి చెందిన నాయకుడు. ఇద్దరి నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకొని వారి పేర్లకు ఆమోదం తెలుపాలని కేబినెట్​భేటీ తర్వాత మంత్రి కేటీఆర్ ​మీడియా ద్వారా గవర్నర్‌‌‌‌‌‌‌‌ను కోరారు. అయితే ఇద్దరి పేర్లను ఏ కేటగిరీలో నామినేట్​చేశారో పేర్కొనకపోవడంతో పెండింగ్‌‌‌‌లో పెట్టినట్లు గవర్నర్ చెబుతున్నారు. దీంతో ఆ ఇద్దరి పేర్లకు గవర్నర్​ఆమోదం తెలుపుతారా? అలాగే పెండింగ్‌‌‌‌లో పెడుతారా? అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. 

గవర్నర్ మాటలను బట్టి చూస్తే దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లకు ఆమోదం తెలపడం అనుమానమేనని బీఆర్ఎస్​ నేతలే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రపోజల్​కు నిర్దేశిత సమయంలోగా అనుమతి ఇవ్వాలన్న నిబంధన లేకపోవడంతో గవర్నర్ ఇలానే పెండింగ్​లో పెడితే పరిస్థితి ఏమిటనే దానిపైనా ఊహాగానాలు సాగుతున్నాయి. కౌశిక్​రెడ్డి స్థానంలో మధుసూదనాచారి పేరు ప్రతిపాదించినట్టు ఇప్పుడు ప్రపోజ్​చేసిన లీడర్ల పేర్లను మార్చుతారా? లేక వారి పేర్లనే నిర్దేశిత కేటగిరీలో ప్రతిపాదిస్తూ మళ్లీ రాజ్​భవన్​ఆమోదం కోసం పంపుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.