ట్రామా మెడిసిన్ కు అత్యంత ప్రాధాన్యత : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

ట్రామా మెడిసిన్ కు అత్యంత ప్రాధాన్యత :   గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
  •     వైద్యరంగానికి జాతీయ సదస్సు మైలురాయిగా నిలుస్తోంది
  •     వైద్యులు ఆరోగ్యకరమైన సమాజం కోసం కృషి చేయాలి
  •     గవర్నర్ శివప్రతాప్ శుక్లా

హైదరాబాద్, వెలుగు: రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో ట్రామా మెడిసిన్ కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. సాక్టెమ్ ఫౌండేషన్, మెడికవర్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గచ్చిబౌలిలోని మెడికవర్ హాస్పిటల్ లో 'ట్రామా, కాన్‌‌‌‌ఫ్లిక్ట్ మెడిసిన్' అనే అంశం పై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా గవర్నర్ హాజరై మాట్లాడారు. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు వైద్యుల నిర్ణయాలు, సాంకేతిక నైపుణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. 

ఆ సమయంలో వైద్యుల అంకితభావమే అత్యంత శక్తివంతమైన సాధనమన్నారు. హైదరాబాద్ నగరం సమాచార సాంకేతిక రంగంతోపాటు సూపర్-స్పెషాలిటీ వైద్య సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని వివరించారు. గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సు వైద్యరంగానికి ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. 

ట్రామా కాన్ ఫ్లిక్ట్​మెడిసిన్ రంగాల్లో నిపుణులను తీర్చిదిద్దడం, క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ సదస్సుకు వివిధ రాష్ర్టాల నుంచి ప్రముఖ డాక్టర్లతోపాటు విదేశాల నుంచి నిపుణులు హాజరవడం సంతోషకరమన్నారు. వైద్యులు చికిత్సలకే పరిమితం కాకుండా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైద్యుల సున్నితత్వం, సేవాభావమే ఆరోగ్య వ్యవస్థకు నిజమైన బలం అని పేర్కొన్నారు. అనంతరం సదస్సు నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్ బృందాన్ని గవర్నర్ అభినందించారు. సదస్సులో గవర్నర్ స్పెషల్ సీఎస్ దానకిషోర్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.