చర్లపల్లి జైలులో డీఅడిక్షన్ సెంటర్ ప్రారంభించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

చర్లపల్లి జైలులో డీఅడిక్షన్ సెంటర్ ప్రారంభించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

హైదరాబాద్, వెలుగు: జైళ్లలో డీఅడిక్షన్ సెంటర్ల  ఏర్పాటు అభినందనీయమని  గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. సోమవారం ఆయన చర్లపల్లి సెంట్రల్ జైలులో 'నివృత్తి' డ్రగ్స్ డీఅడిక్షన్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో చాలా సార్లు జైలు అనుభవం ఉన్నందున ఖైదీలు, జైలు సిబ్బంది ఎదుర్కొనే సమస్యలను బాగా అర్థం చేసుకున్నానని చెప్పారు. జైళ్లలో ఫ్యాన్లు, టీవీల వంటి సౌకర్యాలు కల్పించడం, పోలీసు కానిస్టేబుళ్లకు వార్డెర్లతో సమాన వేతనాలు ఇవ్వడం వంటి చర్యలను గవర్నర్ గుర్తుచేశారు. 

నషా ముక్త్ భారత్ అభియాన్  స్కీమ్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ర్ట ప్రభుత్వం డ్రగ్స్ నివారణకు చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు. జైళ్ల శాఖ డీజీ  సౌమ్య మిశ్రా నాయకత్వంలో డీఅడిక్షన్​ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణను గవర్నర్ ప్రశంసించారు. డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ..చర్లపల్లి జైలులో డీఅడిక్షన్ సెంటర్​ ఏర్పాటు  ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. 

చంచల్ గూడ, చర్లపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్ సెంట్రల్ జైళ్లు, హైదరాబాద్ మహిళా ప్రత్యేక జైలులో  'నివృత్తి' కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం గవర్నర్ చర్లపల్లి ప్రిజన్ అగ్రికల్చరల్ కాలనీ (పీఏసీ)ని సందర్శించారు. ఖైదీలతో మాట్లాడి వ్యవసాయ, వృత్తి ఆధారిత కార్యక్రమాలను పరిశీలించారు. పబ్లిక్ -ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటైన 'ఏరియా 77' నేచర్ క్యాంప్, అడ్వెంచర్ పార్క్ ను సందర్శించి ప్రశంసించారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీ మురళీ బాబు, డీఐజీ శ్రీనివాస్, సూపరింటెండెంట్లు శివకుమార్ గౌడ్, ప్రమోద్, అధికారులు పాల్గొన్నారు.