- చంచల్‌గూడలో ఫీల్ ది జైల్, మ్యూజియం ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: జైళ్లు కేవలం శిక్ష విధించే ప్రదేశాలుగా మాత్రమే కాకుండా సమాజ అభ్యున్నతికి దోహదపడే సంస్కరణల కేంద్రాలుగా మారాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఎవరూ పుట్టుకతో నేరస్తులు కారని.. కొన్నిసార్లు పరిస్థితులు వారిని అలా మారుస్తాయని పేర్కొన్నారు. అలాంటి వారిలో ఆత్మపరిశీలన, వ్యక్తిత్వ వికాసం, కొత్త జీవితానికి నాంది పలికే కేంద్రాలుగా జైళ్లు మారాలని సూచించారు. చంచల్‌గూడలోని సెంట్రల్ జైలు ఆవరణలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కరక‌్షనల్ అడ్మినిస్ట్రేషన్ (సికా)లో ఏర్పాటు చేసిన ‘ఫీల్ ది జైలు’, జైలు మ్యూజియంను ఆయన మంగళవారం ప్రారంభించారు.
జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రాతో కలిసి ఫీల్ ది జైల్ సెల్‌లను, మ్యూజియంను సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ సమయంలో తాను విద్యార్థి నాయకుడిగా 19 నెలలు జైలు జీవితం గడిపినట్టు చెప్పారు. ఆ తర్వాత కాలంలో తాను జైళ్లశాఖ మంత్రిగా పనిచేసి.. యూపీ జైళ్లలో సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ జైళ్లశాఖ తీసుకువచ్చిన సంస్కరణలు బాగున్నాయన్నారు. తెలంగాణ జైలు మ్యూజియం ఏర్పాటు రాష్ట్ర కారాగార పరిపాలన చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని, ఇది చారిత్రక వస్తువుల సమాహారంగానే కాకుండా న్యాయం, శిక్ష, సంస్కరణ, మానవీయ మార్పును ప్రతిబింబిస్తుందన్నారు.
ఫీల్ ది జైల్ కార్యక్రమం ద్వారా ప్రజలకు జైలు జీవితం, క్రమశిక్షణ, ఖైదీల పరిస్థితులు, కారాగార పరిపాలనపై అవగాహన పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇది చట్టాల పట్ల గౌరవం, బాధ్యత, మానవీయత, సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తుందని తెలిపారు.
చారిత్రక అధ్యయనం కోసమే
జైలు మ్యూజియం అవగాహన, విద్య, పరిశోధన, చారిత్రక అధ్యయనం కోసం సమగ్ర కేంద్రంగా అభివృద్ధి చేశామని జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా అన్నారు. జైలు జీవితం గడపాలనుకునే వారు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్స్ కోసం అధికారిక వెబ్‌సైట్ www.telanganajailexperience.com లో సంప్రదించాలని సౌమ్యామిశ్రా తెలిపారు. కాగా, ఫీల్ ది జైల్ ఎంట్రీ కోసం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల స్లాట్‌కు రూ. వెయ్యి, 24 గంటలకు రూ.2 వేలు నిర్ధారించారు.
