మెగా వ్యాక్సినేషన్‭తో మిలియన్ల మరణాలు ఆపగలిగాం: తమిళి సై

మెగా వ్యాక్సినేషన్‭తో మిలియన్ల మరణాలు ఆపగలిగాం: తమిళి సై

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా గత ఏడాది చేపట్టిన మెగా వ్యాక్సినేషన్ తో మిలియన్ల మరణాలను ఆపగలిగామని గవర్నర్ తమిళిసై అన్నారు. ఈ ఏడాది దేశ, రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని దేశం మరింత డెవలప్ కావాలని ఆమె ఆకాంక్షించారు. ఆదివారం న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్  మాట్లాడారు. కొవిడ్ వ్యాక్సిన్ తో దేశంలో కరోనా ఇబ్బంది లేదన్నారు. కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మహమ్మారి కంట్రోల్ అయ్యిందని డబ్ల్యూహెచ్ వో, యూఎన్  వంటి సంస్థలు వెల్లడించాయని ఆమె గుర్తు చేశారు. 

81 కోట్ల మందికి  ప్రతినెలా కేంద్రం ఉచిత రేషన్ ఇస్తోందని తమిళి సై చెప్పారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రాంచంద్రన్ , మెంబర్లు, ఆర్టీఐ అధికారులు గవర్నర్ కు శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు. అంతకుముందు గవర్నర్  చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని  దర్శించుకొన్నారు. కాగా రాజ్ భవన్ లో న్యూ ఇయర్ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు, అధికారులు గైర్హాజరయ్యారు. సీఎస్, డీజీపీ, పలువురు పోలీసు కమిషనర్లు సైతం కార్యక్రమానికి హాజరు కాలేదు.