బిల్లులను తిరస్కరణపై గవర్నర్ తమిళిసై క్లారిటీ

బిల్లులను తిరస్కరణపై  గవర్నర్ తమిళిసై క్లారిటీ


హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రిటైర్మెంట్ వయసు సవరణ బిల్లును తిరస్కరించటం, మున్సిపల్ చట్టంలో సవరణ బిల్లును ప్రభుత్వానికి తిప్పి పంపడంపై గవర్నర్ తమిళిసై క్లారిటీ ఇచ్చారు.  రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు బిల్లులో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ రిటైర్ మెంట్ ఏజ్​ను 2019 జూన్ 20 నుంచి  65 ఏండ్లకు పెంచుతున్నట్లు తెలిపిందన్నారు.

డీఎంఈ, ఏడీఎంఈ పదవీ విరమణ పెంపుపై బిల్లులో ఎక్కడా ప్రస్తావించలేదని మంగళవారం ఒక ప్రకటనలో  గవర్నర్ వెల్లడించారు. రిటైర్ మెంట్ ఏజ్ పెంపు వల్ల ఎంత మందికి లబ్ధి జరుగుతుందని, రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుందో చెప్పాలని ప్రభుత్వాన్ని గవర్నర్ వివరణ కోరారు. హెల్త్ మినిస్టర్ పేరుతో పంపిన బిల్లులో రాష్ట్ర ఖజానాపై ఎలాంటి భారం పడదని పేర్కొన్నారని, ఇది తనను తప్పుదోవ పట్టించటమేనని తమిళిసై పేర్కొన్నారు.

ఇక మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై స్పందిస్తూ..74వ రాజ్యాంగ సవరణలోని పారా IXAలో ఉన్న ఆర్టికల్ 243పీ, 243జీలో రిజర్వేషన్ ప్రకారం ఆయా సీట్లకు ఎన్నికలు జరుగుతాయని తమిళిసై తెలిపారు. మున్సిపాలిటీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వార్డ్ కమిటీల  చైర్ పర్సన్లకు మాత్రమే కో ఆప్షన్ మెంబర్లుగా అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం పంపిన మున్సిపల్ సవరణ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని వివరించారు. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత గవర్నర్​గా తనపై ఉందని తెలిపిన తమిళిసై అందుకే ఈ బిల్లును వెనక్కి పంపినట్లు పేర్కొన్నారు.