తీన్మార్ మల్లన్న బిడ్డను దగ్గరకు తీసుకుని.. చలించిపోయిన గవర్నర్ తమిళిసై

తీన్మార్ మల్లన్న బిడ్డను దగ్గరకు తీసుకుని.. చలించిపోయిన గవర్నర్ తమిళిసై

పాపకు ఏమైందమ్మా అంటూ తీన్మార్ మల్లన్న బిడ్డను దగ్గరకు తీసుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై..మార్చి 23వ తేదీ గురువారం.. మల్లన్న అరెస్ట్.. పోలీసుల తీరుపై హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి కంప్లయింట్ చేశారు మల్లన్న భార్య. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న బిడ్డను చూసి చలించిపోయారు గవర్నర్.. ఏమైందీ అంటూ పాపను దగ్గరకు తీసుకున్నారు. ఒడిలో పెట్టుకుని పాపను పరీక్షించారు. సహజంగా డాక్టర్ అయిన గవర్నర్ తమిళిసై.. పాపకు ఉన్న అనారోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాపను ఒడిలో కూర్చోపెట్టుకుని లాలించారు..ఎలాంటి ట్రీట్ మెంట్ జరుగుతుందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు గవర్నర్ తమిళిసై..

మల్లన్న లేకుండా బిడ్డ ఉండలేదని.. నాన్న నాన్న అంటూ రోజూ కలవరిస్తుందని.. బిడ్డను చూడకుండా మల్లన్న కూడా ఉండలేడంటూ గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు మల్లన్న భార్య మమత. పాప పరిస్థితి చూసి కూడా పోలీసులు కనికరించలేదంటూ వివరించారు. పాపను చాలాసేపు తన ఒడిలోనే కూర్చోపెట్టుకుని ఆడించిన గవర్నర్ తమిళిసై.. డాక్టర్ గా కొన్ని సూచనలు, సలహాలు మల్లన్న భార్యకు ఇచ్చారు. గవర్నర్ తమిళిసై ఒడిలో.. తీన్మార్ మల్లన్న బిడ్డ అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి. పాపను చూస్తే మనసు తరుక్కుపోతుందంటున్నారు నెటిజన్లు.

గతంలోనూ..

2021లోనూ తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేయడంతో అతని కూతురు అప్పుడు కూడా తండ్రిపై బెంగ పెట్టుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురై ..ఐసీయూలో చికిత్స పొందింది. మల్లన్న కూతురు ఆరోగ్యం ముందు నుంచీ సరిగా ఉండదు. అయితే మల్లన్న అరెస్టు తర్వాత...ఆ చిన్నారి బాగా బెంగ పెట్టుకుంది. తన తండ్రి లేకపోవడంతో అన్నం తినడం మానేసింది. దీంతో అప్పట్లో  తీవ్ర అస్వస్థతకు గురైంది.