ప్రజల సంక్షేమమే నాకు ఫస్ట్​..

ప్రజల సంక్షేమమే నాకు ఫస్ట్​..
  • బడ్జెట్ సెషన్ లో స్పీచ్ లేదనడంపై గవర్నర్ ఫైర్
  • ప్రజల సంక్షేమమే నాకు ఫస్ట్​.. ప్రసంగం లేకపోతే సభ్యులకే నష్టం
  • ఫైనాన్స్​ బిల్లుకు టైమ్​ తీసుకునే అవకాశం ఉన్నా.. ఫెడరల్​ స్ఫూర్తితో ఓకే చెప్పిన
  • మొదట నా ప్రసంగం ఉంటుందని సర్కార్​ చెప్పింది.. వివరణ కోరితే అనుకోకుండా జరిగిందంటున్నారు.. ఇదేం పద్ధతి?

హైదరాబాద్​, వెలుగు: గవర్నర్​ ప్రసంగం లేకుండానే బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమవుతాయన్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్​ తమిళిసై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదట తన స్పీచ్​ఉంటుందని ప్రభుత్వం నోట్​ పంపిందని, ఆ తర్వాత దానిపై స్పష్టత కోరగా.. ప్రసంగం లేదని తెలిపిందన్నారు. ఇట్లా వ్యవహరించడం ఏం సంప్రదాయమని మండిపడ్డారు. అయినా తనకు ప్రజల సంక్షేమమే మొదటి ప్రాధాన్యమని, మరే విషయాలైనా, ఎలాంటి పరిస్థితులైనా ఆ తర్వాతేనని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా, ఫెడరల్​ స్ఫూర్తితోనే తాను ఫైనాన్స్ బిల్లుకు ఓకే చెప్పానని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజానికి ఫైనాన్స్​ బిల్లును రికమండ్​ చేసేందుకు తగిన సమయం తీసుకునే స్వేచ్ఛ తనకు ఉంటుందని, కానీ రాష్ట్ర ప్రజల సంక్షేమం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆలస్యం చేయకుండా ఓకే చెప్పానని వివరించారు. పాత సెషన్​నే కొనసాగిస్తున్నందున ఇది కొత్త సెషన్​ కాదని ప్రభుత్వం తెలిపిందని, అయితే సాధారణంగా ఎక్కువ కాలం గ్యాప్​ తర్వాత సభ ప్రారంభమైతే కొత్త సెషన్​గానే నిర్వహిస్తారని గవర్నర్​ గుర్తుచేశారు. ‘‘ప్రస్తుత సభ 5 నెలల గ్యాప్​ తర్వాత సమావేశమవుతున్నది.  ఎక్కువకాలం విరామం తర్వాత కూడా పాత సెషన్ కొనసాగించాలని ప్రభుత్వం భావించింది. సంప్రదాయంగా ఉండే గవర్నర్ స్పీచ్​ను టెక్నికల్ కారణాలతో వద్దనుకుంది. గవర్నర్ ప్రసంగం అనేది గవర్నర్ ఆఫీస్ తయారుచేసేది కాదు...అది అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసే ప్రకటన” అని పేర్కొన్నారు. బడ్జెట్ సెషన్​లో గవర్నర్ స్పీచ్ లేకపోవడం ద్వారా గత ఏడాదిలోని ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోయారని తమిళిసై​ అన్నారు. 

‘అనుకోకుండా’ జరగడమేంది?
గత ఏడాది ప్రభుత్వ పనులకు, విజయాలకు గవర్నర్ స్పీచ్ రిపోర్ట్ కార్డు అని, వచ్చే ఏడాదికి విధాన ఆలోచనలను ఆ స్పీచ్ చెప్తుందని గవర్నర్​ గుర్తుచేశారు. పాలన గురించి, స్పీచ్ లోని అంశాలను గురించి సభలో సభ్యులు అర్థవంతమైన చర్చ జరపడానికి  స్పీచ్ అవకాశం కల్పిస్తుందన్నారు. ప్రజాస్వామిక సూత్రాలను నిలబెట్టడానికి గవర్నర్ స్పీచ్ ఒక ప్రధాన సాధనమని, ఈ స్పీచ్ ప్రజలతో ఎన్నికైన సభ్యులకు ప్రభుత్వాన్ని జవాబుదారీగా మారుస్తుందని చెప్పారు. రాజ్యాంగ ప్రజాస్వామిక విలువలకు గవర్నర్ పాత్ర పరిమితంగా, ఉత్ప్రేరకంగా ఉంటుందన్నారు.  ‘‘ఫైనాన్స్ బిల్లుకు రికమెండేషన్ కోరినప్పుడు గవర్నర్ స్పీచ్ తోనే సెషన్ మొదలవుతుందని ప్రభుత్వం చెప్పింది. దీనిపై క్లారిఫికేషన్​ కోరగా.. దురదృష్టవశాత్తూ, ఇట్లా అనుకోకుండా జరిగిందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రజాస్వామిక స్ఫూర్తిని చాటాల్సిన నోట్ లో ‘అనుకోకుండా’ జరిగిందనే మాటే హాస్యాస్పదం” అని గవర్నర్  తమిళి సై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘‘గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ సెషన్ పెట్టుకునే విచక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. పాత సెషన్ నే కొనసాగిస్తూ ఇది కొత్త సెషన్ కాదని ప్రభుత్వం చెప్పింది. ఈ టెక్నికల్ కారణం వల్లే గవర్నర్ స్పీచ్​ను ప్రభుత్వం వద్దనుకుంది’’ అని తెలిపారు. 

రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ..
ఫైనాన్స్​ బిల్లు  ప్రవేశపెట్టడానికి తాను రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ, సహకార సమాఖ్య స్ఫూర్తిని నిలబెడుతూ, రాజకీయాలకు అతీతంగా రికమండేషన్​ ఇచ్చానని గవర్నర్​ తమిళిసై స్పష్టం చేశారు. ‘‘రికమెండేషన్ చేసే విషయంలో టైం తీసుకునే స్వేచ్ఛ నాకుంది. కానీ ఇది ప్రజల సంక్షేమానికి సంబంధించిన విషయం కాబట్టి, ప్రజల మేలుకు ప్రాధాన్యం ఇస్తూ ఎలాంటి జాప్యం లేకుండా నా రికమెండేషన్ ఇచ్చా” అని చెప్పారు. బడ్జెట్ సెషన్ లో గవర్నర్ స్పీచ్ లేకపోవడం ద్వారా గత ఏడాదిలో ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోయారని, ఏదేమైనా తెలంగాణ ప్రజలకు తన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ‘‘గవర్నర్ కు రాజ్యాంగం కొన్ని పవర్స్ ఇచ్చినా, గవర్నర్ ప్రసంగం ఉండదని నిర్ణయించినా, సభలో బడ్జెట్ పెట్టడానికి నా రికమెండేషన్ ఇచ్చా. ఎందుకంటే ప్రజల సంక్షేమానికే నా మొదటి ప్రాధాన్యం. మరే విషయాలైనా, ఎలాంటి పరిస్థితైనా ప్రజల సంక్షేమం తర్వాతే’’ అని గవర్నర్​ స్పష్టం చేశారు.