వ్యవస్థలో లోపాలను కొత్త విద్యా విధానంతో సరిదిద్దుకోవచ్చు : తమిళిసై

వ్యవస్థలో లోపాలను కొత్త విద్యా విధానంతో సరిదిద్దుకోవచ్చు : తమిళిసై
  • రాజకీయ కారణాలతోనే కొందరు వ్యతిరేకిస్తున్నరు: గవర్నర్​ తమిళిసై

గచ్చిబౌలి, వెలుగు :  కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానంతో మన విద్యా వ్యవస్థలో లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఏర్పడిందని గవర్నర్​ తమిళిసై అన్నారు. స్టూడెంట్లను గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వ్యక్తులుగా తీర్చిదిద్దే మార్గం ఏర్పడుతుందన్నారు. కానీ, కొంతమంది రాజకీయ కారణాలతోనే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు.

హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవ వేడుకలు శుక్రవారం గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్​ గ్లోబల్​ పీస్​ ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు యూనివర్సిటీ గ్రాంట్​ కమిషన్ (యూజీసీ) చైర్మన్​ జగదీశ్​​కుమార్​తో కలిసి గవర్నర్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్టూడెంట్లు తమకు ఏ రంగంలో ఆసక్తి ఉందో అందులో రాణించేందుకు ఇష్టంతో కష్టపడాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏషియన్​ గేమ్స్​లో మన దేశ క్రీడాకారులు 127 పతకాలు సాధించి.. చైనాలో మన జాతీయ పతాకాన్ని127 సార్లు ఎగరవేయడం గర్వకారణమన్నారు. 

సమస్యలపై యువత దృష్టి సారించాలి

నేటి తరం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, కాలుష్యం, ఇతర సమస్యలపై యువత దృష్టి సారించాలని యూజీసీ​ చైర్మన్​ జగదీశ్​​కుమార్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు భారత్​ దూసుకుపోతోందని, ఇందులో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. దేశంలో 65% మంది స్టూడెంట్స్​ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, వారికి సరైన విద్యా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కొత్త జాతీయ విధానాన్ని అమలు చేయకపోతే విద్యార్థులకు తీరని నష్టం కలుగుతుందన్నారు. అనంతరం డిగ్రీలు పూర్తి చేసుకున్న 1,745 మంది స్టూడెంట్లకు పట్టాలు అందజేశారు. 2022 ఏడాదికి గాను ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐదుగురు వర్సిటీ ప్రొఫెసర్లకు చాన్స్​లర్​ అవార్డులను అందజేశారు.