నేనొచ్చాకే కేబినెట్​లో మహిళలు : గవర్నర్ ​తమిళిసై

నేనొచ్చాకే కేబినెట్​లో మహిళలు : గవర్నర్ ​తమిళిసై
  • నాపై రాళ్లు వేస్తే వాటితో బిల్డింగ్ కట్టుకుంట
  • పిన్నులు కుచ్చితే వచ్చే రక్తంతో చరిత్ర రాస్త
  •  గవర్నర్ ​తమిళిసై వ్యాఖ్యలు
  • రాజ్​భవన్​లో మహిళా చట్టం థ్యాంక్స్​ గివింగ్ ​ప్రోగ్రామ్​

హైదరాబాద్, వెలుగు : “రాష్ట్రానికి నేను గవర్నర్ గా వచ్చినపుడు కేబినెట్​లో మహిళా మంత్రి లేరు. నేను వచ్చాకే ఇద్దరు మహిళా మంత్రులను కేబినెట్​లోకి తీసుకున్నరు. మహిళలకు గౌరవంపెరిగింది.  మహిళా బిల్లు ఆమోదించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. మహిళా రాష్ట్రపతి మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించటం గర్వకారణం’’ అని తెలంగాణ గవర్నర్​  తమిళిసై అన్నారు.

తాను గవర్నర్​గా వచ్చినప్పటి నుంచి రాజకీయ నేత, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అని విమర్శలు చేస్తున్నారని, పార్టీ పదవి నుంచి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని, అందులో దాచడానికి ఏం లేదన్నారు. ‘‘బొకేలు ఇస్తే తీసుకుంటున్న, విమర్శలు చేస్తే పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్న. నాపై రాళ్లు వేస్తే వాటితో బిల్డింగ్ కట్టుకుంటా, పిన్నులు కుచ్చితే వచ్చే రక్తంతో చరిత్ర రాస్తా ” అంటూ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా శనివారం రాజ్​భవన్​లో వివిధ రంగాల్లో ప్రముఖ మహిళలతో గవర్నర్ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. రాజకీయాలపై ఇష్టంతో డాక్టర్ వృత్తిని వదిలి వచ్చానన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా రాజ్ నాథ్​సింగ్ ఉన్నపుడు పార్టీ లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు అయ్యాయని, పార్టీ పదవుల్లో చాలా మంది మహిళలకు పదవులు వచ్చాయని, అన్ని పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించారని తమిళిసై అన్నారు. దేశ రాజకీయాల్లో ఈ బిల్లు చాలా మార్పులు తీసుకువస్తుందని, ఎక్కువ మంది మహిళలు అసెంబ్లీలు, పార్లమెంట్​లోకి వెళ్తారన్నారు.

ఎన్ని అవమానాలు ఎదురైనా తాను వెనక్కి తగ్గనని, సేవ చేసేందుకే  రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి శాలిని మిశ్రా, రిటైర్డ్ ఐపీఎస్ అరుణ బహుగుణ, ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ శైలజ సుమన్ , సివిల్స్ కోచింగ్ నిపుణురాలు బాలలతతో పాటు మహిళా జర్నలిస్టులు, డాక్టర్లు, అడ్వకేట్లు సుమారు100 మంది పాల్గొన్నారు.

సాంస్కృతిక మహోత్సవంలో గవర్నర్

న్యూఢిల్లీ, వెలుగు : కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘జోనల్ రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవ’కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు. శనివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆమె, నేరుగా సీపీ సెంట్రల్ పార్కుకు చేరుకొని ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ సంస్కృతిలోని గొప్పతనాన్ని తమిళిసై గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రధాని పర్యటన ఉన్న నేపథ్యంలో మహోత్సవ కార్యక్రమం ముగిసిన వెంటనే తిరిగి హైదరాబాద్​కు వచ్చేశారు. కాగా దేశంలోని విభిన్న సాంస్కృతిక వారసత్వ ప్రదర్శనతో పాటు సాంస్కృతిక మార్పిడి ద్వారా జాతీయ ఐక్యత, సమగ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.