
నివారణకు ప్లాన్ రూపొందించాలె
సైంటిస్టులకు గవర్నర్ సూచన
సికింద్రాబాద్, వెలుగు : రక్తహీనతను నివారించేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని గవర్నర్ తమిళిసై సూచించారు. తార్నాకలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ( ఎన్ఐఎన్ ) కు గవర్నర్ సోమవారం వెళ్లారు. అక్కడి సైంటిస్టులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ అట్టడుగు వర్గాలకు చెందిన వారిలో రక్తహీనత ఎక్కువగా ఉంటోందని చెప్పారు. స్కూల్ స్టూడెంట్లలో రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపారు.‘‘పిల్లలే దేశ భవిష్యత్తు. వారిని అలా వదిలేయకూడదు. ఎనీమియాను నివారించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలి. అట్టడుగు వర్గాల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తృణధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇస్తున్న పౌష్టికాహారం వల్ల ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. మంచి ఫలితాలు రాబట్టేందుకు తృణధాన్యాల వినియోగం పై వారికి మరింత అవగాహన కల్పించాలి. రాష్ట్రంలోని చాలా ట్రైబల్ ఏరియాల్లో గిరిజనులు ఐరన్ లోపం సమస్యను ఎదుర్కొంటున్నరు. నేను స్వయంగా పలు గిరిజన ప్రాంతాల్లోపర్యటించినపుడు ఈ విషయాలను గుర్తించాను” అని గవర్నర్ వెల్లడించారు.
ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు రాష్ట్రంలోని ఖమ్మం, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లోని ఆరు గిరిజన గ్రామాలను ఎంపిక చేసి, అక్కడ ఐరన్ సమస్యను ఎదుర్కొంటున్న వారికి ఇప్ప పూలతో తయారు చేసిన మహువ లడ్డూలు ఇచ్చామని, దీంతో వారు ఐరన్ సమస్యను అధిగమించారని వివరించారు. గ్రామాల్లో లభించే మునగాకులో అత్యధిక పోషక విలువలు ఉంటాయని, వాటిపై ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ హేమలత, సైంటిస్టులు డాక్టర్ శ్రీనివాస్ రావు, డాక్టర్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.