
- సీఎంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని హామీ
- భూపాలపల్లి జిల్లా బోడగూడెంలో గిరి జనులతో తమిళిసై ము ఖాముఖి
- అక్కగా వచ్చా .. ఆతిథ్యాన్ని మరవలేను.. రాజ్ భవన్ రండి.. ఆతిథ్యం స్వీకరించండి
- గుడిసెలోని మహిళకు రెండో ఏఎన్‌ఎంగా జాబ్.. స్పాట్ లోనే అపాయింట్ మెంట్ ముఖాముఖిలో
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ‘‘ఒక్క పూరి గుడిసెలో నాలుగు ఫ్యామిలీలా.. మీరంతా ఇక్కడ ఎలా ఉంటున్నారు? ఎలా నివసిస్తున్నారు”జయశంకర్ భూపాలపల్లి జిల్లా బోడగూడెంలో ఆదివాసీ గిరిజన కుటుంబాల పరిస్థితి చూసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్న మాటలివీ. వారి పరిస్థితి చూసి ఆమె చలించిపోయారు. గ్రామంలో సమస్యలు తెలుసుకున్నానని, సీఎంతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళిసై తొలిసారిగా జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలో మంగళవారం పర్యటించారు. ముందుగా కాటారం మండలం బోడగూడెం గ్రామాన్ని సందర్శించారు. ఆదివాసీ గిరిజనులతో గంట పాటు ముఖాముఖి చర్చ జరిపారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించడంతోపాటు గ్రామంలోని పలువురి ఇండ్లలోకి వెళ్లి పరిశీలించారు.
తెలుగులో మాట్లాడిన గవర్నర్
గవర్నర్ తమిళిసై ఉదయం 10.30 గంటలకు బోడగూడెం చేరుకున్నారు. ముందుగా అంగన్ వాడీ సెంటర్ కు వెళ్లారు. జిల్లా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు అందించే పోషక విలువలు కలిగిన ఫుడ్ కు సంబంధించిన స్టాల్ గురించి అధికారులు వివరించారు. మిషన్ భగీరథ నీటిని జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో కలిసి గవర్నర్ ప్రారంభించారు. స్టూడెంట్స్ కు యూనిఫాంలు, బ్యాగ్ లు, మహిళలకు బ్లాంకెట్లు అందజేశారు. పలు ఆదివాసీ సంఘాల నాయకులు గవర్నర్‌కు చిత్ర పటాలు బహూకరించారు. వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. గ్రామంలోని లక్ష్మీదేవర గుడిలో గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఆదివాసీ గిరిజనులతో ముఖాముఖీ కోసం ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి గవర్నర్ చేరుకున్నారు. ‘‘గిరిజన ప్రజలందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం”అని గవర్నర్ తెలుగులో మాట్లాడటంతో ఆ ప్రాంతమంతా చప్పట్లతో మారుమోగింది. ఆ తర్వాత గవర్నర్ ఇంగ్లిష్లో మాట్లాడగా జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలుగులోకి అనువదించారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన మహిళలు గ్రామ సమస్యలను గవర్నర్ దృష్టికి తెచ్చారు.
ఇండ్లు, భూములు ఇప్పించాలె: గిరిజనులు
‘‘మా గ్రామంలో అందరం నిరుపేదలమే. ఊరిలో ఇండ్లు, భూమి లేక ఇబ్బంది పడుతున్నం. సదువుకున్న పిలగాండ్లకు నౌకర్లు లేవు. ప్రభుత్వం నౌకర్లు పెట్టియ్యాలె. ఉండేందుకు ఇండ్లు, ఎవుసానికి భూమి ఇప్పించాలె”అని గావిడి మల్లక్క గవర్నర్ ను కోరారు. ‘‘మేడం మీ రాకతో మా ఊరికే కళ వచ్చింది. అడవిలో దొరికే గడ్డలు, దుంపలు తిన్నోళ్లం. మాకు ఇండ్లు, భూములు లేవు. మిగతా గవర్నమెంట్ పథకాలు వస్తున్నయి. మా ఊర్ల ఇద్దరు అనాధ పిల్లలు ఉన్నరు. వారికి సహాయం చేయాలి”అని గురిసింగ రాజక్క గవర్నర్ దృష్టికి తెచ్చారు. ‘‘ఊరిలో చదువుకున్నోళ్లు ఉన్నారు. వారు వ్యవసాయ కూలీలుగా బతుకుతున్నారు. వారికి చిన్న నౌకర్లన్న ఇప్పించాలె. ఉండడానికి ఇండ్లు, సాగు చేస్కోడానికి భూమి ఇప్పించాలె’’అని కాల్నేని మమత గవర్నర్‌ను కోరారు. వారి మాటలు విన్న గవర్నర్ నైస్ టాకింగ్ అంటూ పొగిడారు. వీరికి తగిన పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. స్పందించిన అధికార్లు మమత చదువును బట్టి ఆమెను పార్ట్ టైం ఏఎన్ఎంగా నియమిస్తూ స్పాట్లోనే ఉత్తర్వులు జారీ చేసి జాయినింగ్ లెటర్ ను గవర్నర్ చేతుల మీదుగా
అందజేశారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్
ముఖాముఖి తర్వాత ప్రజలనుద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ.. ఆదివాసీల స్థితిగతులను తెలుసుకున్నానని, గ్రామ అవసరాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ‘‘అంగన్‌వాడీ సెంటర్ కు వెళ్లి చూశాను. చాలా మంచి కార్యక్రమం చేపడుతున్నారు. గర్భిణులకు పోషకాహారం అందించడం గొప్ప విషయం. ప్రోటీన్ లు పలు రకాల ఆహార పదార్థాలు అందించడం చాలా నచ్చింది”అని అన్నారు. గర్భిణులు తప్పకుండా ఐరన్ టాబ్లెట్లు వాడాలని, ఆరోగ్యంతోపాటు డెలివరీ టైమ్లో ఇబ్బందులు తలెత్తకుండా అవి ఉపయోగపడతాయని సూచించారు. గవర్నర్ వెంట సెక్రటరీ సురేంద్ర మోహన్, ఎస్పీ సంగ్రాం సింగ్, ఐటీడీఏ పీవో చక్రధర్ రావు, జేసీ స్వర్ణలత, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఏఎంసీ చైర్ పర్సన్ ఆన్కారి భవానీ ప్రకాశ్, సర్పంచ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు