
- రాజ్‌భవన్‌కు బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లులు!
- త్వరలోనే వర్గీకరణకు గెజిట్.. దానికి అనుగుణంగా రోస్టర్
- వచ్చే నెలలోనే జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చేలా చర్యలు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, శాసన మండలిలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు రాజ్ భవన్‌కు చేరినట్లు తెలిసింది. చట్టసభల్లో ఆమోదం పొందిన తరువాత.. ప్రొసీజర్ ప్రకారం ఆయా బిల్లులు గవర్నర్ ఆమోదానికి వెళ్తాయి. అందులో భాగంగానే స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపింది. ఇందులో వర్గీకరణకు గవర్నర్ ఆమోదం లభించనుంది.
ఆ వెంటనే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. దానికి అనుగుణంగా జీవోలు ఇవ్వడం, ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించి కొత్త రోస్టర్ తయారు చేయాలని అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. వచ్చే నెలఖారులోపు జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. వాస్తవానికి గత ఏడాది అక్టోబర్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. వర్గీకరణ అంశం తేల్చి.. ఆ ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చిన తరువాతే నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించడంతో వాయిదా వేశారు. ఇప్పుడు వాటన్నింటిని రీషెడ్యూల్ చేసి ప్రకటించనున్నారు.
రాష్ట్రపతి దగ్గరకు బీసీ రిజర్వేషన్ల బిల్లులు
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం రెండువేర్వేరు బిల్లులను అసెంబ్లీ,మండలిలో ఆమోదింపజేసుకున్నది. ఈ రెండు బిల్లులు కూడా గవర్నర్ కు దగ్గరకు వెళ్లినట్లు తెలిసింది. అయితే, రిజర్వేషన్ల పెంపు అంశం కేంద్రం పరిధిలోని వ్యవహారం కావడంతో ఈ బిల్లులను గవర్నర్ రాష్ట్రపతికి పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదముద్ర తరువాత.. ఆ చట్టాన్ని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాల్సి ఉంటుంది. అప్పుడే ఏ కోర్టు కూడా కొట్టివేసేందుకు అధికారం ఉండదు.
తమిళనాడులో ఈరకంగానే 50 శాతానికిపైగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అందులో భాగంగానే ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగతున్న సమయంలోనే రాష్ట్రపతికి బీసీ బిల్లులు వెళితే.. కేంద్రం దగ్గరకు వెళ్లి వాటిని ఆమోదించుకునేలా ఒత్తిడి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు ఆయన లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ కూడా అడిగారు. ఒకవేళ కేంద్రం నుంచి సరైన స్పందన రాకపోతే ఏరకంగా ముందుకు వెళ్లాలనే దానిపైనా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.