కరెంటు కోతలతో పంటలెండుతున్నయ్​

కరెంటు కోతలతో పంటలెండుతున్నయ్​
  • కరెంట్ కోతలతో పంటలు ఎండుతున్నాయని రైతుల ఆవేదన

దుబ్బాక/కొమురవెల్లి/గోవిందరావుపేట, వెలుగు: ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెలియని కరెంట్ కారణంగా చేతికొచ్చిన పంట కళ్లెదుటే ఎండిపోతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సర్కారు తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగుతున్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డిపేట గ్రామ రైతులు సిద్దిపేట–మెదక్​ రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను పెట్టడంతో ఇరువైపులా ఎక్కడి వెహికల్స్​అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. ఇప్పటికే వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగాయని, వచ్చిపోయే కరెంట్​తో బోరు మోటార్లు కాలిపోతున్నాయని వాపోయారు. 15 రోజుల పాటు 24 గంటల విద్యుత్​ను నిరంతరాయంగా సరఫరా చేస్తే వేసిన పంటను దక్కించుకుంటామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఆఫీసర్లు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. విద్యుత్ అప్రకటిత కోతలను నిరసిస్తూ కొమురవెల్లి విద్యుత్ ఉపకేంద్రం ముందు శుక్రవారం రైతులు ధర్నా నిర్వహించారు. పంటలు నాటే ముందు 24 గంటల కరెంటు ఇచ్చారని, పంటకు నీరు అవసరమున్న సమయంలో కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని ఆఫీసర్లను కోరారు. 

16 గంటల దీక్ష
కరెంటు కోతలను నిరసిస్తూ ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోని సబ్​ స్టేషన్​ఎదుట రైతులు దీక్ష చేపట్టారు. సూరపనేని వెంకట సురేశ్​ఆధ్వర్యంలో చల్వాయి గ్రామానికి చెందిన 20 మంది రైతులు గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 16 గంటల పాటు దీక్ష చేశారు. ఈ సందర్భంగా రైతు వెంకటసురేశ్​మాట్లాడుతూ సీఎం కేసీఆర్​యాసంగిలో వరి వేయొద్దని చెప్పడంతో లక్నవరం సరస్సు కింద సుమారు 10 వేల ఎకరాల్లో పంట వేయకుండా ఆగిపోయామన్నారు. బోరు సదుపాయం ఉన్న రైతులు పంట వేశారని, 15 రోజుల్లో పంట చేతికొస్తుందనుకుంటే.. కోతలు విధిస్తూ దిక్కులేని స్థితిలోకి నెట్టేశారన్నారు. రాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే పవర్​ ఇస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని తేల్చుకునేందుకు గురువారం రాత్రి 7 గంటలకు సబ్​ స్టేషన్​కు వచ్చామని, ఆఫీసర్లు సరైన సమాదానం చెప్పకపోవడంతో దీక్షకు దిగామన్నారు. రైతుల దీక్షకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్​రెడ్డి, గోవిందరావుపేట మండల అధ్యక్షుడు మద్దినేని తేజరాజు ఆధ్వర్యంలో నాయకులు సంఘీభావం తెలిపారు.  పవర్​ సప్లై చేస్తామని ఆఫీసర్లు మాట ఇవ్వడంతో రైతులు దీక్ష విరమించారు. దీక్షలో బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్​, యూత్​అధ్యక్షుడు కొత్త సురేందర్, ఇమ్మడి రాకేశ్​యాదవ్, ఏనుగు రవీందర్​రెడ్డి, రైతులు పాల్గొన్నారు.