సర్కార్ డాక్టర్ మండలానికి ఒక్కరే 

సర్కార్ డాక్టర్ మండలానికి ఒక్కరే 
  • రాష్ట్రంలో 12,760 గ్రామాలకు 626 పీహెచ్ సీలే
  • 3,766 డాక్టర్ పోస్టులు ఖాళీ 
  • పీహెచ్‌‌‌‌సీలు, డాక్టర్ల సంఖ్యను పెంచని సర్కార్ 
  • ఆర్ఎంపీలు ఆపరేషన్లూ చేస్తున్రు 

హైదరాబాద్, వెలుగు: డాక్టర్ల అవసరం రోజు రోజుకూ పెరుగుతున్నా, మన సర్కార్ దవాఖాన్లలో డాక్టర్ల సంఖ్య మాత్రం పెరగడం లేదు. డాక్టర్లకు ఉన్న డిమాండ్‌‌‌‌తో ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీల సంఖ్య మాత్రం బాగా పెరుగుతోంది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం, రాష్ట్రంలో 35 వేల మంది ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలు యాక్టివ్‌‌‌‌గా ఉన్నారు. గతంలో ఊరికో ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీ ఉంటే, ఇప్పుడు ఊరికో ముగ్గురు ఉన్నారు. క్వాలిఫైడ్ డాక్టర్లు మాత్రం కనీసం పది ఊర్లకు ఒక్కరు కూడా ఉండటంలేదు. రాష్ర్టంలో 12,760 గ్రామాలు ఉంటే, 626 ప్రైమరీ హెల్త్ సెంటర్లు (పీహెచ్ సీలు) మాత్రమే ఉన్నాయి. దీంతో జ్వరానికి, సర్దికి, కాళ్ల నొప్పులకు, ఒళ్లు నొప్పులకు.. ఇలా అన్నింటికీ ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీల క్లినిక్‌‌‌‌లే దిక్కు అవుతున్నయి. ఏ రోగంతో వచ్చినా ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలు తమకు తెలిసిన ట్రీట్ మెంటే చేసి పంపుతున్నరు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో 43 మంది ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలు ఉంటే, ఒకే ఒక్క పీహెచ్‌‌‌‌సీ ఉంది. అందులో ఒక్కరే డాక్టర్ పని చేస్తున్నారు. 50 వేలకుపైగా జనాభా ఉన్న ఆ మండలంలో సాయంత్రం 4 గంటలకే పీహెచ్‌‌‌‌సీ బంద్ అవుతోంది. ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీ క్లినిక్‌‌‌‌లు మాత్రం అర్ధరాత్రి వరకూ పనిచేస్తాయి. రూరల్ ఏరియాల్లోని అన్ని మండలాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. కొన్ని మండలాల్లో అసలు ఒక్క పీహెచ్‌‌‌‌సీ కూడా లేదు. 
పీహెచ్ సీలను పట్టించుంకుంటలే 
కొత్త కొత్త రోగాలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హాస్పిటళ్ల సంఖ్య పెంచాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. మన దగ్గర రూరల్‌‌‌‌ పీహెచ్‌‌‌‌సీలు 626, అర్బన్ హెల్త్ సెంటర్లు 220 ఉన్నాయి. వీటిల్లో1,426 డాక్టర్ పోస్టులు ఉండగా, ఇందులో 258 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంకో120 మంది డిప్యుటేషన్‌‌‌‌పై జైళ్లు, ఇతర శాఖల్లో పని చేస్తున్నారు. సుమారు1000 మంది మాత్రమే పీహెచ్‌‌‌‌సీలలో ఉన్నారు. రాష్ట్రంలో పీహెచ్‌‌‌‌సీల సంఖ్య, క్యాడర్ స్ర్టెంత్ పెంచాల్సిన అవసరం ఉన్నా సర్కార్ పట్టించుకోవడం లేదు. 
ఏపీలో 24 గంటలూ పీహెచ్ సీలు 
ఏపీలో ప్రతి మండలానికి రెండు పీహెచ్‌‌‌‌సీలు ఏర్పాటు చేశారు. ప్రతి పీహెచ్‌‌‌‌సీకి ఇద్దరు డాక్టర్లను నియమించి, అన్ని పీహెచ్‌‌‌‌సీలను 24 గంటలు నడిచేలా, డాక్టర్లు స్థానికంగా ఉండేలా రూల్స్ మార్చారు. ఆన్‌‌‌‌ కాల్ పేరిట కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. ఏ టైమ్‌‌‌‌లోనైనా ఎమర్జెన్సీ కేసు వస్తే, డాక్టర్ పీహెచ్‌‌‌‌సీకి రావాల్సి ఉంటుంది. మన దగ్గర మాత్రం అసలు పీహెచ్‌‌‌‌సీల పెంపు ఆలోచనే చేయడం లేదు. కొన్ని చోట్ల పీహెచ్‌‌‌‌సీల కోసం బిల్డింగ్‌‌‌‌లు కట్టి వదిలేశారు. మన దగ్గర కూడా ఏపీ తరహాలో ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్‌‌‌‌ను పటిష్టం చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రాష్ర్టంలో డాక్టర్ల సంఖ్య పెరగడంతో పట్టణాల్లో  గల్లీ, గల్లీలో హాస్పిటళ్లు, క్లినిక్‌‌‌‌లు పుట్టుకొచ్చాయి. చాలా మందికి గిరాకీ లేకపోవడంతో, రూరల్ ఏరియాల్లో పనిచేయడానికైనా  ముందుకొస్తున్నారు. మంచి జీతం, వసతి కల్పించాలని కోరుతున్నారు. 
3,766 పోస్టులు ఖాళీ
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక ప్రభుత్వ డాక్టర్ ఉండాలి. మన దగ్గర కనీసం ఐదు వేల మందికి ఒక డాక్టర్ కూడా లేరు. రాష్ర్టంలో 4 కోట్ల మంది జనాభా ఉంటే, అన్ని రకాల గవర్నమెంట్ దవాఖాన్లలో కలిపి 4,039 మంది డాక్టర్లు ఉన్నారు. ఇంకో 3,766 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ బేసిస్‌‌‌‌పై భర్తీ చేయకుండా.. టెంపరరీ ఉద్యోగాలు చేయాలని నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. అందులోనూ అత్తెసరు జీతాలు ఆఫర్ చేస్తున్నారు. ఈ టెంపరరీ జాబ్‌‌‌‌లపై డాక్టర్లు ఇంట్రస్ట్ చూపించడం లేదు. రూరల్‌‌‌‌లో పనిచేసే డాక్టర్లకు ఇన్సెంటివ్స్ ఇస్తామని అంటున్నారు తప్పితే, అమలులోకి తేవడం లేదు.

గతంలో ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీలు చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. పేషెంట్ పరిస్థితి బాలేకుంటే హాస్పిటల్‌‌‌‌కు పంపించేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏ రోగం వచ్చినా గూగుల్‌‌‌‌ చేసి మెడిసిన్ ఇచ్చేస్తున్నారు. కొందరు ఏకంగా హాస్పిటళ్లు పెట్టి ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. అవసరం లేకున్నా స్టెరాయిడ్స్, యాంటిబయాటిక్స్‌‌‌‌, హైడోసు పెయిన్ కిల్లర్స్‌‌‌‌ ఇస్తున్నారు. వీటితో టెంపరరీగా రోగం తగ్గినా, దీర్ఘకాలంలో కిడ్నీలపై, ఇతర అవయవాలపై ఎఫెక్ట్ పడుతోంది. రోగం తిరగబెట్టిన తర్వాత పెద్ద హాస్పిటల్‌‌‌‌కు వచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరగుతోంది. యాంటిబయాటిక్‌‌‌‌ రెసిస్టెన్స్ పెరిగి, అవసరమైన సమయంలో ఆ మందులు వేసుకున్నా పని చేయడం లేదు. దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డాక్టర్లు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినా ప్రయోజనం లేకపోయిందని డాక్టర్లు చెప్తున్నారు. పీహెచ్‌‌‌‌సీలను బలోపేతం చేసి రిఫరల్ సిస్టమ్‌‌‌‌ తెస్తామని, యాంటిబయాటిక్ పాలసీ అమలు చేస్తామని చెప్పినా ఇప్పటివరకూ అమలు కాలేదు.