మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్: చాలా వస్తువులు చవకగా...జీఎస్టీ తగ్గే చాన్స్

మధ్యతరగతి ప్రజలకు  గుడ్ న్యూస్:  చాలా వస్తువులు చవకగా...జీఎస్టీ తగ్గే చాన్స్


న్యూఢిల్లీ: మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిత్యావసర వస్తువులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారాన్ని తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనివల్ల   టూత్‌పేస్ట్  టూత్ పౌడర్, గొడుగులు, కుట్టు యంత్రాలు, ప్రెషర్ కుక్కర్లు,  వంటగది పాత్రలు, ఎలక్ట్రిక్ ఐరన్‌లు, గీజర్‌లు,  తక్కువ సామర్థ్యం గల వాషింగ్ మెషీన్లు, సైకిళ్లు, రూ.1,000 కంటే ఎక్కువ ధర గల రెడీమేడ్ దుస్తులు, రూ.500 నుండి రూ.1,000 మధ్య ధర గల పాదరక్షలు, స్టేషనరీ వస్తువులు, టీకాలు, సిరామిక్ టైల్స్,  వ్యవసాయ పరికరాలపై పన్ను భారం తగ్గుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ శ్లాబులో ఉన్న వస్తువులలో చాలా వరకు మధ్య, దిగువ ఆదాయ కుటుంబాలు రోజువారీగా ఉపయోగించేవే.

ఈ వస్తువులపై జీఎస్టీని పూర్తిగా తొలగించడం లేదా వాటిని 5 శాతం శ్లాబులోకి మార్చాలన్న ప్రపోజల్​ను కేంద్రం పరిశీలిస్తోంది. దీని ద్వారా సామాన్యులపై ఆర్థిక భారం తగ్గించాలని భావిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ. 40 వేల కోట్ల నుంచి రూ. 50 వేల కోట్ల వరకు భారం పడొచ్చని అంచనా. అయినప్పటికీ, ధరలు తగ్గితే వినియోగం పెరిగి, దీర్ఘకాలంలో పన్ను వసూళ్లు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇటీవలే జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరిస్తామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే మధ్యతరగతి ప్రజలకు భారీ ఉపశమనం లభించనుంది.