
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పలువురు పాక్ సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్లు, మీడియా ఛానెళ్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండానే వారి ఇన్స్టా గ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ ఎత్తేసింది. మాజీ పాక్ స్టార్ క్రికెటర్ షాహిదీ ఆఫ్రిదీ, సబా కమర్, మావ్రా హొకేన్, అహద్ రజా మీర్, హనియా అమీర్, యుమ్నా జైదీ, డానిష్ తైమూర్ వంటి అనేక మంది పాకిస్తానీ ప్రముఖుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు బుధవారం (జూలై 2) నుంచి భారత్లో ఓపెన్ అవుతున్నాయి. హమ్ టీవీ, ఏఆర్వై డిజిటల్, హర్ పాల్ జియో వంటి పాకిస్తానీ యూట్యూబ్ వార్త ఛానెళ్ల ప్రసారాలు కూడా భారత్లో మళ్లీ ప్రత్యక్షమవుతున్నాయి.
కాగా, జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో 2025, ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. టూరిస్టులే లక్ష్యంగా టెర్రిరిస్టులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణలతో డాన్ న్యూస్, సమా టీవీ, ఆరీ న్యూస్, జియో న్యూస్ సహా 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లను భారత్ నిషేధించింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పలువురు పాక్ సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్లను కూడా కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది.
►ALSO READ | రక్తాలు పారుతాయన్న భుట్టోకి బుద్ధి వచ్చింది: ఉగ్రవాద నిర్మూలన ముందుకు రావాలని భారత్కు పిలుపు
భారత్లో పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్, పలువురు సెలబ్రెటీల సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి.. పరిస్థితులు సద్దుమణగడంతో కేంద్ర ప్రభుత్వం పాక్ సెలబ్రెటీల అకౌంట్లు, పాక్ వార్త చానెళ్లపై విధించిన నిషేధాన్ని ఎత్తేసింది. కానీ నిషేధం ఎత్తివేతపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు.