
- నీటి వాటాల నుంచి ప్రాజెక్టుల అప్పగింత దాకా ఏపీది ఇదే తీరు
- తెలంగాణ నీటి హక్కులపై కుట్రలు.. సహకరించుకుందామంటూనే అడ్డంకులు
- 2015లోనే సంతకాలతో నీటి వాటాల దోపిడీ.. అభ్యంతరం చెప్పని నాటి బీఆర్ఎస్ సర్కారు
- తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులే లేవంటూ ట్రిబ్యునల్‌లో ఏపీ వాదనలు
- పాలమూరు, డిండి, సీతారామ, కాళేశ్వరం సహా ఎన్నో ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు
- సాగర్ ప్రాజెక్టును మనకు అప్పగించకుండా మోకాలడ్డు.. కొట్లాటకు దిగి మరీ స్వాధీనం
- పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై డొంక తిరుగుడు మాటలు
- ప్రగతి మీటింగ్‌లో చర్చకు రాకుండా వెనక నుంచి కుతంత్రాలు
హైదరాబాద్, వెలుగు: నీటి హక్కుల విషయంలో ఏపీ మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. ముందు నీతులు మాట్లాడుతున్న ఆ రాష్ట్ర పాలకులు.. వెనక నుంచి మాత్రం గోతులు తవ్వుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలైన ఏపీ పాలకుల కుట్రలు.. తెలంగాణ వచ్చాక కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలో పాలకులు మారుతున్నా.. తెలంగాణపై వాళ్ల తీరు, కుట్రలు మారడంలేదు. తమకు రెండు రాష్ట్రాలూ సమానమే అంటూనే రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ నీటి వాటాలు, ప్రాజెక్టుల అప్పగింత, ట్రిబ్యునల్‌లో వితండ వాదనలు, పోలవరం బ్యాక్ వాటర్ ముంపు సహా ఎన్నో అంశాలపై తెలంగాణకు ఏపీ పాలకులు కొర్రీలు పెడుతూనే ఉన్నారు. మన నీటి హక్కులకు విఘాతం కలిగిస్తున్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. అందుకు మన గత పాలకుల తీరు కూడా తోడవడంతో ఏపీ ఆగడాలకు అడ్డుకట్ట అన్నదే లేకుండా పోయింది.
తెలంగాణ నీటి ప్రయోజనాలకు విఘాతం కలిగేలా రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే ఏపీ ప్రభుత్వం కుట్ర పన్నింది. 2015లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే నీటి వాటాలపై ఒప్పందం జరిగింది. ఏపీ 66 శాతం నీళ్లను తన్నుకుపోగా, అప్పటి బీఆర్ఎస్ సర్కారు 34 శాతానికే ఓకే చెప్పింది. నాడు గట్టిగా వాదించి మనకు పరివాహకప్రాంతం ఆధారంగా 70 శాతం నీళ్లు.. లేదా కనీసం సగం కోటా కోసమైనా కొట్లాడాల్సిన నాటి బీఆర్ఎస్ పాలకులు ఏపీ చెప్పిన దానికి సంతకాలు చేశారు. నీళ్ల విషయంలో ఇచ్చిపుచ్చుకోవాలని మాట్లాడుతున్న ఏపీ.. గద్దలా మన నీళ్లనూ ఎగదన్నుకుపోతున్నది. వాటాకు మించి తరలించుకుపోతున్నది. మన రాష్ట్రం లెక్క ప్రకారం నీటిని వాడుకుంటున్నా.. ఇంకా చెప్పాలంటే అంతకన్నా తక్కువ వినియోగిస్తున్నా.. ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. కృష్ణా ట్రిబ్యునల్‌లోనూ అదే రీతిలో వ్యవహరిస్తున్నది. అసలు తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులే లేవంటూ వాదిస్తున్నది.
మన ప్రాజెక్టులపై ఫిర్యాదులు..
తెలంగాణ కూడా నీళ్లు తీసుకోవచ్చంటున్న ఏపీ పాలకులే మన ప్రాజెక్టులపై కేంద్రానికి లెక్కలేనన్ని ఫిర్యాదు చేశారు. కరువు జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు నీళ్లిచ్చే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును ఆపాలంటూ 2016లో నాటి కేంద్రం జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. డిండి, తుమ్మిళ్ల, కల్వకుర్తి, నెట్టెంపాడు, సుంకిశాల ప్రాజెక్టులనూ అడ్డుకోవాలంటూ కేంద్రానికి, కృష్ణాబోర్డుకు ఎన్నో లేఖలు రాశారు. ఇది ఒక్క కృష్ణా ప్రాజెక్టులకే పరిమితం కాలేదు.. గోదావరిపై కట్టిన అన్ని ప్రాజెక్టులపైనా అలాగే వ్యవహరించారు.
చంద్రబాబు హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్లందించే భక్త రామదాసు లిఫ్ట్ స్కీమ్‌ను ఆపాలంటూ 2017లో కేంద్రానికి చంద్రబాబు కంప్లయింట్ చేశారు. ఇదే ఆనవాయితీని జగన్ కూడా కొనసాగించారు. సీతారామకు నీటి కేటాయింపులు చేయవద్దంటూ సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కు నాటి జగన్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. తెలంగాణకు నీళ్లు దక్కకుండా ఉండేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని పెంచి మరీ నీటిని ఏపీకి తరలించుకుపోయారు. శ్రీశైలం డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని తన్నుకుపోయే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కూ జగన్ హయాంలోనే బీజం పడింది. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన గత బీఆర్‌ఎస్ పాలకులు.. పరోక్షంగా ఏపీకి సహకారం అందించారు. గవినోళ్ల శ్రీనివాస్ అనే ఓ రైతు సుప్రీం కోర్టులో కేసు వేశాకగానీ.. ఆ కేసులో ఇంప్లీడ్ కాలేదు.
పోలవరం బ్యాక్వాటర్పైనా అదే తంతు
పోలవరం బ్యాక్ వాటర్‌తో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు మునుగుతాయని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), ఏపీ ప్రభుత్వం, సెంట్రల్ వాటర్ కమిషన్ ముందు తెలంగాణ సర్కారు ఎన్నోసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. జాయింట్ సర్వే చేయించాలని పట్టుబట్టింది. కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అన్నది. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలంలో 954 ఎకరాలు ముంపునకు గురవుతాయని మన అధికారులు చెబుతున్నారు. మరో 36 వాగుల డ్రైనేజీ సిస్టమ్స్ ప్రభావితమవుతాయని చెబుతున్నారు. దీనిపై జాయింట్ సర్వే చేయించాలంటే ఏపీ కుదరదని తేల్చి చెప్పింది. ఇదే అంశంపై ప్రధాని నేతృత్వంలో జరిగే ప్రగతి మీటింగ్‌లో చర్చించాల్సి ఉన్నా.. ఏపీ అడ్డుకున్నదన్న ఆరోపణలూ ఉన్నాయి. మీటింగ్‌లో తొలి ఎజెండాగా పోలవరం అంశం ఉన్నప్పటికీ.. 2 రోజుల ముందే దానిని తొలగించారు. చంద్రబాబే తప్పించారన్న వాదనలూ ఉన్నాయి. జూన్ 25న జరిగిన ప్రగతి మీటింగ్ నుంచి కేవలం రెండు గంటల ముందు ఆ అంశాన్ని తప్పించారు. దీని వెనకా ఏపీ ప్రభుత్వం ఉందన్న ఆరోపణలు వినిపించాయి.
సాగర్ డ్యామ్పైనా కిరికిరి..
తెలంగాణ ఏర్పాటు తర్వాత నాగార్జునసాగర్ డ్యామ్‌ను తెలంగాణ, శ్రీశైలంను ఏపీ నిర్వహిస్తున్నాయి. కానీ, జలదోపిడీ కోసం నాగార్జునసాగర్‌నూ ఏపీ చెరబట్టింది. సాగర్ కుడి కాల్వ నుంచి అందినకాడికి నీటిని దోచుకెళ్లింది. ఇప్పటికీ దోచుకుంటున్నది. ఇక, 2018లో సరిగ్గా ఎన్నికలకు ముందు ఏపీ అధికారులు సాగర్ డ్యామ్‌ను తమ అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్నది. కట్టెలతో కొట్టుకునే వరకు వెళ్లింది. దీంతో కేంద్రం అక్కడ సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించింది. అప్పట్నుంచి సాగర్ డ్యామ్ కేంద్ర బలగాల అధీనంలోనే ఉన్నది. అయినా కూడా ఏపీ మాత్రం మరోసారి 2023 డిసెంబర్‌లోనూ ఇలాగే ఘర్షణలకు పాల్పడింది. ఏపీ అధికారులు వాళ్లవైపున్న 13 గేట్లను స్వాధీనంలోకి తెచ్చుకుని సాగర్ కుడి కాల్వను వాళ్లే నియంత్రించుకోవడం మొదలుపెట్టారు. నిరుడు నవంబర్‌లో కుడి కాల్వ రీడింగ్‌ను నమోదు చేసేందుకు వెళ్లిన తెలంగాణ అధికారిని ఏపీ అధికారులు నిర్బంధించారు. ఎప్పటినుంచో సాగర్ ప్రాజెక్టును అప్పగించాలంటూ కృష్ణా బోర్డు ముందు తెలంగాణ డిమాండ్ వినిపిస్తున్నా.. ఎప్పటికప్పుడు ఏపీ అడ్డుపుల్ల వేస్తూనే ఉన్నది. వారం కిందట జరిగిన బోర్డు మీటింగ్‌లోనూ తమ ఎస్పీఎఫ్ను పెట్టుకుంటామని ఏపీ మొండిగా వాదించింది. శ్రీశైలం ప్రాజెక్టును తన అధీనంలోకి తీసుకుని జలదోపిడీకి పాల్పడుతున్న ఏపీ.. తెలంగాణ హక్కులను కాలరాస్తున్నది.
తెలంగాణ, ఏపీ వేర్వేరు కాదు. రెండూ ఒకటే. అదే భావనను మున్ముందూ కలిగి ఉండాలి. నదీ జలాలను రెండు రాష్ట్రాల్లోని సాగునీటి అవసరాలు తీర్చే విధంగా మలుచుకుంటే ఎంతో మేలు.
- ఏపీ మాజీ సీఎం జగన్ (2019 జూన్ 28)