కోతల ఖర్చులు డబుల్.. గోస పడుతున్న అన్నదాతలు

కోతల ఖర్చులు డబుల్.. గోస పడుతున్న అన్నదాతలు
  • ..టూ వీలర్​ వరికోత మిషన్​ స్థానంలో తప్పనిసరైన ఫోర్​వీలర్ లేదా చైన్​ మిషన్​
  • గోస పడుతున్న అన్నదాతలు

జనగామ, వెలుగు :  మొంథా తుఫాన్​ రైతులను నిలువునా ముంచింది. ఎన్నడూ లేనంతగా దంచికొట్టిన వానకు పంటలు ఆగమయ్యాయి. వరి, పత్తి పంటల పరిస్థితి దయనీయంగా మారింది. కోతకు వచ్చిన వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. తడిసి ముద్దవడమే కాకుండా పంటంతా అడ్డం పడడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా కోతల ఖర్చులు డబుల్​ అవుతున్నాయి. దీంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు.

ఫోర్​ వీలర్​లే దిక్కు..

ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా వానలకు వరి పంట తడిసి ముద్ధయ్యింది.. టూ వీలర్​ వరి కోత మిషన్​తో కోయాల్సిన పంట ఇప్పడు ఫోర్​ వీలర్​ లేదంటే చైన్​మిషన్ వాడకం తప్పని సరిగా మారింది. పంట ఆరిపోయి భూమి గట్టిగా ఉంటేనే టూ వీలర్​ వరికోత మిషన్లతో కోతలు చేసేందుకు వీలుంటుంది. ఫోర్​ వీలర్​ మిషన్లు కొంతమేర భూమి దిగబడినా కోయగలుగుతాయి. కానీ, తుఫాన్​దెబ్బకు ఆగమైన వరి పంట పలుచోట్ల చైన్​మిషన్​అయితేనే కోయగలిగే స్థితిలో ఉన్నాయి. పంట చేనులో నీళ్లున్న చోట వీటితో కోతలు చేపట్టవచ్చని రైతులు చెబుతున్నారు. పూర్తిగా లేదా సగం సగం నీళ్లు లేక బురద ఉంటే గోస తప్పదని వాపోతున్నారు. 

ఖర్చులు డబుల్..​

జనగామ జిల్లాలో ఈ వానాకాలంలో 2,13,978 ఎకరాల్లో వరి సాగైంది. సుమారు 5,43,057 మెట్రిక్​ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. వీటిలో 2,05,057 మెట్రిక్​ టన్నుల ధాన్యం సర్కారు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని టార్గెట్​పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 309 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి పలుచోట్ల ప్రారంభించినా ప్రక్రియ ఊపందుకోలేదు. ఇదిలాఉంటే ఇప్పటి వరకు 30 శాతం వరకు కోతలు పూర్తి కాగా, మరో వారం రోజుల వ్యవధిలో కోతలు చేపట్టే స్థితిలో 30 నుంచి 40 శాతం పంటలు రెడీగా ఉండగానే, తుఫాన్​ నిండా ముంచిందని రైతులు వాపోతున్నారు. 

జిల్లాలో ఇప్పటికే 18,320 ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. కోతకు వచ్చిన పంటలు ఎక్కువ మొత్తంలో అడ్డంపడిపోయాయి. అటు తడి, ఇటు అడ్డంపడ్డ వరిని చైన్​ మిషన్ల సాయంతోనే కోయాల్సిన పరిస్థితి ఉంది. టూ వీలర్​ అయితే గంటకు రూ.2 వేలు తీసుకుంటుండగా, ఇవి గంట లేదా గంట పది నిమిషాల్లో ఎకరం వరిని కోస్తాయి. అదే ఫోర్​ వీలర్​అయితే ఎకరానికి రూ.2,800ల నుంచి రూ.3 వేల వరకు తీసుకుంటున్నారు. 

గంట పది నిమిషాల నుంచి గంటన్నర టైం ఎకరం కోతకు తీసుకుంటాయి. ఇక చైన్​ మిషన్​కు రూ.3,500ల నుంచి రూ.4 వేల వరకు చార్జ్​ చేస్తుండగా, గంటన్నరకు అటు ఇటుగా కోత చేపడుతుందని, బురదగా ఉంటే రెండు గంటలు కూడా పడుతుందని రైతులు చెబుతున్నారు. పంట చేను ఆరి ఉంటే వరి కోత మిషన్​ నుంచి వడ్లను అన్​లోడ్​ చేసుకునేందుకు ట్రాక్టర్ ట్రాలీ​ మిషన్​ దగ్గరి వరకు వెళ్తుంది. లేదంటే సదరు వరి కోత మిషన్​ ఒడ్డుకు వచ్చి వడ్లు అన్​లోడ్​ చేసి వెళ్లాల్సిన కారణంగా అదనపు టైం తీసుకుని ఖర్చుల భారం మరింత పెంచుతుందని రైతన్నలు చెబుతున్నారు. ఇంత చేసినా పంట అక్కెరకు వస్తుందా అంటే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఖర్చులు ఎక్కువైతున్నయ్..​ 

మాది జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరు. రెండు ఎకరాల్లో వరి వేసిన. ప్రతిసారి పెద్ద మిషన్ తో కొస్తే ఎకరాకి రెండువేల చొప్పున నాలుగు వేలు అయ్యేది. ఇప్పుడు కోతకు వచ్చిన టైంలో వానకు పంట పూర్తిగా అడ్డం పడ్డది. భూమి ఆరె పరిస్థితి లేదు. చైన్ మెషిన్ తో కోపిద్దామంటే ఎకరానికి నాలుగు వేలు అడుగుతున్నరు. పెద్ద మిషన్ కోస్తే గంటం బావుకు ఎకరం చొప్పున కోసేది. పంట పూర్తిగా అడ్డం పడడంతో చైన్ మిషన్ రెండు గంటలైనా ఎకరం కోసే పరిస్థితి లేదు. ఇప్పుడు పంట కోత ఖర్చు రూ.10 వేలకు వచ్చేట్టుంది.  - కోడె అంజయ్య, రైతు