ఆడ పులిని వెతుక్కుంటూ.. ఆదిలాబాద్‌‌ అడవుల వైపు !..మేటింగ్‌‌ టైం కావడంతో ఉమ్మడి జిల్లా అడవులకు వస్తున్న మగపులులు

ఆడ పులిని వెతుక్కుంటూ.. ఆదిలాబాద్‌‌ అడవుల వైపు !..మేటింగ్‌‌ టైం కావడంతో ఉమ్మడి జిల్లా అడవులకు వస్తున్న మగపులులు
  • మహారాష్ట్ర నుంచి ఇప్పటికే మూడు పులులు వచ్చినట్లు గుర్తింపు
  • పులి సంచారంపై నిఘా పెట్టిన ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు
  • పంట పొలాల్లోకి వెళ్లేందుకు భయపడుతున్న రైతులు

ఆదిలాబాద్, వెలుగు :  మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌‌ జిల్లా అడవులకు కొన్ని రోజులుగా పులుల రాక పెరిగింది. భీంపూర్‌‌‌‌, జైనథ్‌‌ మండలాలకు ఆనుకొని ప్రవహిస్తున్న పెన్‌‌గంగా నదిని దాటి జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రస్తుతం పులుల మేటింగ్‌‌ కావడంతో ఆడ పులిని వెతుక్కుంటూ మగపులులు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్‌‌ జిల్లాల్లోకి వస్తున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో పులుల రక్షణకు చర్యలు పాటు పులుల బారిన పడకుండా అటవీ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 

‘మేటింగ్‌‌’ కోసమే జిల్లాలోకి ఎంట్రీ

మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌‌ అభయారణ్యంలో సుమారు 25 పులులు ఉన్నాయి. ప్రతి ఏడాది ఈ సీజన్‌‌లో మేటింగ్‌‌ కోసం అక్కడి నుంచి పులులు ఆదిలాబాద్‌‌ జిల్లాలోకి వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఇప్పటికే మూడు పులులు, ఒక చిరుత జిల్లాకు వచ్చినట్లు తెలుస్తోంది. మూడు నెలల పాటు ఆదిలాబాద్‌‌ జిల్లాలో ఆవాసం ఏర్పాటు చేసుకొని ప్రత్యుత్పత్తి తర్వాత ఫిబ్రవరిలో మళ్లీ మహారాష్ట్రకు వెళ్లిపోతాయని ఆఫీసర్లు చెబుతున్నారు. బోథ్, భీంపూర్, తాంసి, బోరజ్ మండలాల్లోని పంట పొలాల్లో ఇటీవల పులుల అడుగులను గుర్తించారు. 

దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులుల సంచారాన్ని తెలుసుకునేందుకు బోథ్ అటవీ రేంజ్‌‌ పరిధిలో 12 సీసీ కెమెరాలను చేశారు. ఐదుగురు సభ్యులతో రెండు ట్రాకింగ్‌‌ టీమ్స్‌‌ను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. తిప్పేశ్వర్ నుంచి మగ పులులు భీంపూర్‌‌ నుంచి బోథ్, నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి పొచ్చమ్మ ఫారెస్ట్‌‌ మీదుగా మహారాష్ట్రలోని కిన్వాట్‌‌ ఫారెస్ట్‌‌లో ఉన్న ఆడ పులుల కోసం వెళ్తాయని, మరో వైపు జన్నారం, పెంబీ కవ్వాల్‌‌ రిజర్వ్ ఫారెస్ట్‌‌లో ఉన్న ఆడ పులి కోసం ప్రయాణాన్ని కొనసాగిస్తాయని చెబుతున్నారు.

 అయితే ఎప్పుడు వచ్చే పెద్ద పులి కాకుండా.. ప్రస్తుతం దాని పిల్లలు వస్తున్నట్లు గుర్తించారు. శనివారం భీంపూర్‌‌ మండలంలోని గొల్లఘడ్, తాంసికే, పిప్పల్‌‌కోట్‌‌ గ్రామ పరిసర ప్రాంతాల్లో, మూడు రోజుల కింద బోథ్ మండలంలోని చింతల్‌‌బోరిలో పెద్దపులి సంచరించింది. గత నెల 26న నార్నూర్‌‌ మండలంలోని కటోడి గ్రామ పంట పొలాల్లో పులి సంచరించినట్లు ఆఫీసర్లు గుర్తించారు.

భయాందోళనలో రైతులు

మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌‌ జిల్లా వైపు వస్తున్న పులులు గతంలో పశువులు, పంట పొలాల్లో పనిచేసే కూలీలపై దాడి చేశాయి. ఇటీవల సైతం ఆసిఫాబాద్‌‌ జిల్లాలోని నవేగాం, ఈస్గాం బీట్‌‌లో పులి చంపేసిన పశువుల కళేబరాలను గుర్తించారు. ఈ క్రమంలో పంట పొలాల వైపు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. దీంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పొలంలో పనులు చేసుకోవాలని, పులులు దాడి చేయకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు. పులులు తిరిగే ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని, అత్యవసరమైతే గుంపులు, గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు.

వేటగాళ్ల బారిన పడకుండా చర్యలు

జిల్లాలోకి పులుల వలస పెరగడంతో పులి అడుగులను చూసి ఎటువైపు వెళ్తుందనేది వేటగాళ్లు పసిగట్టే ప్రమాదం ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పులి సంచారాన్ని ధ్రువీకరించకుండా ఆఫీసర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పులి ఏ ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తుందన్న విషయంతో పాటు.. అది ఎక్కడెక్కడికి వెళ్తుందన్న విషయాన్ని ట్రాక్‌‌ చేస్తున్నారు.

 ఇంటర్నేషనల్‌‌ మాఫియా సైతం పులుల ఆవాసాలను గుర్తించే అవకాశం ఉంటుందని, అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆఫీసర్లు చెబుతున్నారు. పంట పొలాలతో పాటు వన్యప్రాణులను చంపేందుకు చాలా చోట్ల ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ సీజన్‌‌లోనే పులుల సంచారం 

ప్రతి ఏడాది ఈ సీజన్‌‌లోనే మహారాష్ట్ర నుంచి పులులు వస్తుంటాయి. పులుల మేటింగ్‌‌ టైం కావడంతో ఆడ పులిని వెతుక్కుంటూ మగ పులులు వస్తున్నాయి. బోథ్‌‌ అటవీ రేంజ్ పరిధిలో పెద్ద పులులతో పాటు చిరుతలు సైతం సంచరిస్తున్నట్లు గుర్తించాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి మరిన్ని పులులు వచ్చే అవకాశం ఉంది. పులి ఆనవాళ్లు గుర్తించేందుకు సీసీ కెమెరాలతో పాటు రెండు టీంలను ఏర్పాటు చేశాం. – గులాబ్‌‌ సింగ్‌‌, ఎఫ్‌‌ఆర్‌‌వో, ఆదిలాబాద్‌‌